IPOs in 2022: కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్ ఇష్యూలు 'తగ్గేదేలే' అన్నట్లుగా హోరెత్తించనున్నాయి. వచ్చే ఏడాది కోసం సుమారు రూ.2 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్లు) సమీకరణ లక్ష్యం కలిగిన పబ్లిక్ ఇష్యూలు సిద్ధంగా ఉన్నాయని కోటక్ మహీంద్రా కేపిటల్ నివేదిక పేర్కొంది. ఇందులో సెబీ ఆమోదం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కంపెనీల ఐపీఓల విలువ 15 బి.డాలర్లు (రూ.1,12,500 కోట్లు) కాగా, సెబీకి దరఖాస్తు చేసేందుకు సన్నద్ధమవుతున్న కంపెనీల ఐపీఓల విలువ 11 బి.డాలర్లు (రూ.82,500 కోట్లు) అని తెలిపింది.
- 2021లో ఇప్పటివరకు 65 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా సుమారు రూ.1.35 లక్షల కోట్లు (15.3 బి.డాలర్లు) సమీకరించాయి. పబ్లిక్ ఇష్యూ పరిమాణం సగటు రూ.2,000 కోట్లకు పెరిగింది. 2020లో పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.31,500 కోట్లు మాత్రమే సమీకరించాయి.
- గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పబ్లిక్ ఇష్యూలు సంఖ్య, నిధుల సమీకరణ విలువను కలిపినా.. 2021 కంటే తక్కువే.
- 2022లో కొత్త సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, స్పెషాలిటీ రసాయనాల విభాగంలోని కంపెనీలు ఎక్కువగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చే అవకాశం ఉంది.
- ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల రుసుం వసూళ్లు తొలిసారి 100 కోట్ల డాలర్లను మించాయి. 2020తో పోలిస్తే సుమారు 25 శాతం పెరిగాయి.
- ప్రస్తుత సంవత్సరం 11 నెలల్లో విలీనాలు- కొనుగోళ్ల లావాదేవీల విలువ 4 శాతం పెరిగి 11800 కోట్ల డాలర్లకు చేరింది. 2020లో ఇదే సమయంలో ఇది 114 బిలియన్ డాలర్లుగా ఉంది.
- దేశీయంగా 968 కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ సంస్థలు 58.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే ఈ విలువ సుమారు 10 రెట్లు. అలాగే రిలయన్స్ రిటైల్, జియోలోకి వచ్చిన పెట్టుబడులు మినహాయిస్తే 2019, 2020లో పీఈలు పెట్టిన మొత్తం పెట్టుబడులతో పోలిస్తే కూడా 2021లో వచ్చిన పెట్టుబడులు ఎక్కువే.
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో స్నాప్‌డీల్