మదుపర్లు.. మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి స్పష్టత ఉండి నష్టభయం, రాబడి తదితర అంశాలు అంచనా వేసుకోవాలి. పెట్టుబడులకు సంబంధించి వివిధ రకాల సాధనాలు మదుపర్లకు అందుబాటులో ఉన్నాయి. మదుపర్లు తమ నష్టభయం ఎంతనేది లెక్కించుకుని దానికి అనుకూలంగా ఉండే ఫండ్లను ఎంచుకోవాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్లనే తీసుకుందాం. మదుపర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ రకాల ఫండ్లను ఎంచుకుంటారు. పెట్టుబడులకు సంబంధించి పోర్ట్ ఫోలియో నిర్మించుకునే ముందు మదుపర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం ఎక్కువ ఉండేవి ఉంటాయి. వీటిలో రాబడి కూడా ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. నష్టభయం తక్కువ ఉండే వాటిలో రాబడి తక్కువగా ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మదుపర్లు నష్టభయం, రాబడితోపాటు ఆర్థిక లక్ష్యం, వృద్ధి, పన్ను మినహాయింపులు, నగదు లభ్యతలను దృష్టిలో ఉంచుకోవాలి.
ఈక్విటీలో మదుపు
మదుపర్లు తమ పెట్టుబడుల్లో కొంత శాతం ఈక్విటీ సంబంధిత పెట్టుబడులలో మదుపుచేయడం మంచిది. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో బాగా వృద్ధి చెందుతాయి. ఈక్విటీ కేటగిరీలో వివిధ రకాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజస్త్రసన్ ఆధారంగా లార్జ్ , మిడ్ ,స్మాల్, మల్టీ క్యాప్ ఫండ్లు ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్లు కొంత స్థిరంగా ఉంటాయి. ఇతర ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే వీటిలో పెట్టుబడి చేయడం ద్వారా రాబడికి స్థిరత్వం ఉంటుంది. ఈక్విటీలో దీర్ఘకాలం పాటు మదుపు చేసే వారు ఎక్కువ భాగం లార్జ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవడం మంచిది.
ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఇండెక్స్ ఫండ్లు మంచి ఎంపికని చెప్పవచ్చు. మదుపర్లు కొంత శాతం ఇండెక్స్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటిలో తక్కువ నిర్వహణ రుసుము ఉంటుంది. ఈ ఫండ్లు నిఫ్టీ సెన్సెక్స్ లాంటి మార్కెట్ ఇండెక్స్ లతో పాటు వివిధ రంగాలకు చెందిన ఇండెక్స్‌ల ఆధారంగా కూడా ఉంటాయి.