జీవిత బీమా రంగ వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉందా?
దీర్ఘకాలంలో జీవిత బీమా రంగం 12-15 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుత సంక్షోభం సర్దుమణిగాక ఒక అంచనాకు రావచ్చు. తమపై ఆధారపడిన వారికి తప్పనిసరిగా ఆర్థిక రక్షణ కల్పించాలనే నిర్ణయానికి పాలసీదార్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇకపై పొదుపు, పెట్టుబడి పాలసీలకన్నా టర్మ్ పాలసీలను తీసుకోవడం ద్వారా, అనుకోని విపత్తు ఎదురైనా కుటుంబం బెంబేలు పడకుండా అధిక మొత్తంలో ఆర్థిక రక్షణ కల్పించాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కాబట్టి సానుకూల వృద్ధి ఆశిస్తున్నాం.
కొవిడ్-19 వల్ల జీవిత బీమా రంగానికి ఎదురవుతున్న కొత్త సవాళ్లేమిటి? సంస్థలు ఎలా ఎదుర్కోబోతున్నాయి?
భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పాలసీలను విక్రయించే సంప్రదాయ పద్ధతులకు అంతరాయం కలిగింది. అందుకే డిజిటలీకరణ అధికమవుతోంది. పాలసీలను విక్రయించడం, ఇప్పటికే ఉన్న పాలసీల పునరుద్ధరణ, క్లెయిం సెటిల్‌మెంట్, సేవలు అందించడం తదితరాలన్నింటికీ డిజిటల్, ఇతర సాంకేతికతలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏజెంట్లకూ శిక్షణనిస్తున్నాయి. డిజిటల్ విక్రయాల కోసం సాంకేతికత, నిపుణులపైన ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. బీమా అవసరంపై ప్రజల్లో వచ్చిన సానుకూల మార్పును అందిపుచ్చుకునేందుకు, గిరాకీకి అనుగుణంగా విస్తరించేందుకు డిజిటల్ బాట ఉపయోగపడుతుంది. బీమా ప్రీమియంపై జీఎస్‌టీని తగ్గిస్తే ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని చెప్పొచ్చు.
కొత్త పాలసీల విక్రయం, పాత పాలసీల పునరుద్ధరణపై కొవిడ్-19 ప్రభావం ఎంత మేరకు ఉంది?
లాక్‌డౌన్ బీమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే బీమా పాలసీల విక్రయం ఆన్‌లైన్‌లో సాగడం ఉపకరించింది. మా సంస్థ 2019 ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏప్రిల్‌లో అధిక పాలసీలను విక్రయించింది. మున్ముందు కొత్త బీమా వ్యాపారంపై కొంత ప్రభావం తప్పదు. పునరుద్ధరణ ప్రీమియం వసూలుకు కొంత గడువు పెంచినందున అదీ వాయిదా పడొచ్చు. చెక్కులు, నగదు ద్వారా ప్రీమియం చెల్లింపులూ కొంత ఆలస్యం కావచ్చు. బ్యాంకు ఖాతాల నుంచి ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖË్య పెరుగుతున్నందున, పునరుద్ధరణ ప్రీమియంపై 20-25శాతమే ప్రభావం ఉండొచ్చు.