కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయి. ఆయా దేశాల్లో అంతర్గతంగా సర్వీసులు కొంతమేర నడుస్తున్నా, అంతర్జాతీయ మార్గాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. చైనాతో మొదలు పెట్టి, ఇటలీ, ఇరాన్, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా, భారత్ సహా పలు దేశాలుతొలుత విమాన సర్వీసులు తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు నెలరోజుల పాటు పూర్తిగా నిలిపేశాయి. గిరాకీ తగ్గినందున, మూడొంతులకు పైగా సర్వీసులను విమానయాన సంస్థలే రద్దు చేస్తూ, విమానాలను ఎక్కడికక్కడే నిలిపేస్తున్నాయి. దీనివల్ల ఆయా విమానయాన సంస్థల ఆదాయాలు, లాభాలు, షేర్ల విలువలు భారీగా పతనం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే విమానయాన సంస్థలు దివాలా తీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, ఇంధన సంస్థలు, రిటైలర్లకు సంక్షోభంలో చిక్కుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఐఏజీ (బ్రిటిష్ ఎయిర్‌వేస్, స్పానిష్ సంస్థ ఐబేరియా మాతృసంస్థ):
లండన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఏప్రిల్ - మే నెలల్లో 75 శాతం సర్వీసులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ సంస్థ షేరు విలువ 27 శాతం క్షీణించింది. అయితే యాజమాన్య మార్పు చేయడం లేదని వెల్లడించింది.
- రాబోయే 2 నెలల్లో 70-90 శాతం విమానాలు తగ్గిస్తున్నట్లు ఎయిర్‌ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ సంస్థ షేరు 17 శాతం పతనమైంది.
- గురువారం నుంచి అన్ని విమానాలు నిలిపేస్తున్నట్లు ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పరిస్థితి మెరుగుపడే వరకు 90 శాతం విమానాలు ఆపుతామని ఫిన్‌ఎయిర్ తెలిపింది.
- వర్జిన్ అట్లాంటిక్ (బ్రిటన్) ప్రస్తుతం తమ విమానాల్లో 75 శాతం, వచ్చే నెలలో 85 శాతం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్యకలాపాలు కొనసాగాలంటే 9.2 బిలియన్ డాలర్లు (రూ.68,000 కోట్లకు పైగా) అత్యవసరంగా సాయం చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
- జర్మనీలో లుఫ్తాన్సా మూడింట రెండొంతుల విమానాలను రాబోయే కొన్ని వారాల పాటు నిలిపేయనుంది. అంతర్జాతీయ సర్వీసుల్లో 90 శాతం వరకు కోత విధిస్తోంది.
- అంతర్జాతీయ సర్వీసులు 90 శాతం, దేశీయ సర్వీసులు 60 శాతం తగ్గిస్తున్నట్లు ఆస్ట్రేలియా సంస్థ క్వాంటాస్ ప్రకటించింది.
3 నెలల వరకే నగదు నిల్వలు: ఐటా
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విమానయాన సంస్థల వద్ద నగదు నిల్వలు స్వల్పంగానే ఉన్నాయని విమానయాన సంస్థల సంఘం ఐటా ముఖ్య ఆర్థికవేత్త బ్రెయిన్ పియర్స్ పేర్కొన్నారు. మూడొంతులకు పైగా సంస్థల వద్ద 3 నెలల నిర్వహణకు సరిపడా నిధులు కూడా లేవనే సమాచారం ఉందన్నారు. ప్రపంచంలోని విమానయాన సంస్థల్లో 82 శాతానికి సమానమైన 290 సంస్థలు ఐటాలో సభ్యులు. ప్రపంచం మొత్తంమీద 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14.80 లక్షల కోట్ల) ఆర్థిక సాయం విమానయాన రంగానికి అవసరమని పేర్కొన్నారు.
దేశీయ సంస్థలు ఇలా...
పర్యటక, ఇ-వీసాల జారీని మనదేశం నిలిపేయడంతో, అంతర్జాతీయ సర్వీసులను ఎయిరిండియా, ఇండిగో గణనీయంగా తగ్గించాయి. ప్రయాణ తేదీ మార్చుకున్నా, ఛార్జీలను దేశీయ విమానయాన సంస్థలు వసూలు చేయడం లేదు. విదేశీ సంస్థలు కూడా భారత్‌కు వచ్చి, పోయే 500 సర్వీసులను రద్దు చేశాయి. ఐరోపా సమాఖ్య, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, ఆప్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలను మనదేశం విధించింది.
గో-ఎయిర్: ఏప్రిల్ 15 వరకు అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేయడమే కాక, సిబ్బందికి వేతనం లేని సెలవును చౌకధరల సంస్థ గోఎయిర్ తాజాగా ప్రకటించింది. విడతలుగా దాదాపు 35 శాతం మంది సిబ్బందిని ఇలా సెలవుపై పంపాలన్నది సంస్థ యోచనగా చెబుతున్నారు. వేతనాల్లో 20 శాతం కోత విధించాలనీ నిర్ణయించినట్లు సమాచారం.
అమెరికా విమానయాన సంస్థలు
2011 నాటి భయానక తీవ్రవాద దాడుల అనంతరం కంటే ప్రస్తుత స్థితి దారుణంగా మారిందని, కార్యకలాపాలు కొనసాగించాలంటే 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.70 లక్షల కోట్ల) ఉద్దీపన పథకం అత్యవసరంగా ప్రకటించాలని అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి విమానయాన సంస్థలు కోరుతున్నాయి. ఐరోపానకు రాకపోకలు నెలరోజులు నిలిపేయడంతో, ఏప్రిల్- మే నెలల్లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 50 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ మార్గాల్లో 75 శాతం సర్వీసులు నిలిపేశాయి. డెల్టా, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ కూడా విమానాలు నిలిపేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆఖరుకు 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.70 లక్షల కోట్ల) నగదు లభ్యత సమస్యలు ఎదురవుతాయని సంస్థలు పేర్కొంటున్నాయి.
ప్రయాణించేందుకు విముఖత
అనేక రోజుల పాటు కొత్త బుకింగ్‌లు లేకపోవడంతో పాటు, అత్యధికులు తమ బుకింగ్‌లు రద్దు చేసుకుని, ఇంట్లో ఉండేందుకే ప్రయాణికులు సుముఖత చూపుతున్నారని వర్జిన్ అట్లాంటిక్ తెలిపింది. విమానయాన సంస్థల పరిస్థితి అంతకంతకూ దుర్భరంగా మారుతుందని పేర్కొంది.