ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్లుగా పేరొందిన ఉత్పత్తులు, సంస్థలు పురుడుపోసుకున్న విధానం.. వాటి అధినేతల అలవాట్లపై ప్రత్యేక కథనం.
⦁ ప్రముఖ శీతలపానీయం కోకా-కోలాను కోకా చెట్టు ఆకులు, కోలా గింజలతో తయారుచేస్తారు. కాబట్టి తమ ఉత్పత్తికి కోకా-కోలా అనే పేరు పెట్టారు.
⦁ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ గురించి తెలియని వారుండరు. ఆ సంస్థ లోగో నీలి రంగులోనే ఎందుకు ఉంటుందనే సందేహం చాలామంది అడిగారట. అయితే.. తనకు ఎరుపు, పచ్చ రంగులు సరిగా కనిపించవని.. అందుకే నీలి రంగును ఎంచుకున్నట్లు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.
⦁ 'నీకు ట్రాక్టర్ నడపడం వస్తుందేమో కానీ.. కారును మాత్రం ఎప్పటికీ తయారుచేయలేవు' అంటూ అవమానించిన మాటలనే స్ఫూర్తి వాక్యాలుగా తీసుకున్నారో వ్యక్తి. కట్‌చేస్తే.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీని స్థాపించారు. ఆయనే ఫెర్రూసియో లాంబోర్గినీ. అనతికాలంలోనే లగ్జరీ కార్ల తయారీకి పెట్టింది పేరుగా తన సంస్థను మలచి ఖ్యాతికెక్కారు.
⦁ ఫర్నీచర్ రిటైల్ బ్రాండ్లలో రారాజుగా పేరొందింది ఐకియా. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ ఉత్పత్తులు ఎంత ఫేమస్ అంటే.. ఐరోపాలో జన్మించిన ప్రతి పది మందిలో ఒకరు ఐకియా అమ్మిన పరుపులపైనే జీవం పోసుకున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
⦁ ఇన్స్టంట్ శక్తినిచ్చే ప్రపంచబ్రాండ్ 'న్యూటెల్లా'ను రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితుల్లో తయారుచేశారు. సైనికులకు సరఫరా చేసే కొకోవా నిల్వలు నిండుకోగా.. హెజిల్నట్స్, చక్కెర, కొద్దిపాటి కొకోవాలతో మిశ్రమాన్ని తయారుచేసి వారికి అందించారు. దీనితో సైనికుల ఆకలి బాధను తీర్చారు. అంతేగాక.. కొకోవాను పొదుపుగా వాడుకోవడం మొదలుపెట్టారు.