గత కొంతకాలంగా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు అత్యల్ప స్థాయికి చేరాయి. దీంతో సురక్షిత పెట్టుబడి, రాబడి హామీ ఉండే పథకాల్లో పెట్టుబడులు కొనసాగించాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా కొవిడ్-19 తర్వాత ఆర్‌బీఐ రుణాల వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు, నిలకడగా కొనసాగిస్తుండటంతో ఎఫ్‌డీలపైనా ఆ ప్రభావం పడింది. అయితే, ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకటి రెండు బ్యాంకులు తమ డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులూ ఈ దారిలో పయనించే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు రిటైల్ రుణాలకు గిరాకీ అధికమవుతోంది. బ్యాంకు కాలావధి డిపాజిట్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు డిపాజిట్ల రాక తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు తమ డిపాజిట్ రేట్లను పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
రెండు దశాబ్దాల తర్వాత..
భారతీయ బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీ రేట్లు ఉండటం రెండు దశాబ్దాల కాలం తర్వాతే చూస్తున్నాం. దాదాపుగా అక్టోబరు 2018 నుంచి తగ్గుతున్న డిపాజిట్ వడ్డీ రేట్లు ఇప్పుడు.. 5.40% దరిదాపుల్లో ఉన్నాయి. వయో వృద్ధుల(సీనియర్ సిటిజన్లు)కు ఎస్‌బీఐ 5-10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 6.20 శాతం చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి తర్వాత కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు డిపాజిట్ రేట్లను 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకూ పెంచాయి. ఈ ధోరణి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.