Bank Rules Changes From 1st December: డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని బ్యాంకుల నిబంధనలు మారాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్. కొత్త నిబంధనల్లో భాగంగా నెలవారీగా చెల్లించే ఈఎంఐ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజ్ను వసూలు చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదిలా ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని నిర్ణయించింది. వీటితో పాటు పెన్షనర్లు హెడ్ పోస్టాఫీసుల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తప్పినిసరిగా సమర్పించాలని అధికార వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. వీటి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.
ప్రోసెసింగ్ ఫీజు వసూలు..
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేటి నుంచి (డిసెంబర్ 1, 2021) ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేయాలని నిర్ణయించింది. నెలసరి వాయిదాల ద్వారా చేసే కొనుగోళ్లపై, ముందుగా చేసిన లావాదేవీలను ఈఎంఐగా మార్చడంపై ప్రాసెసింగ్ రుసుమును విధిస్తుంది. ఈఎంఐ లావాదేవీల కోసం, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు వారు చెల్లించే పన్నుతో పాటు రూ. 99 మేర ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది.
వడ్డీ రేట్లను తగ్గిస్తూ...
చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షాక్ చేసింది. నేటి నుంచి పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓ ఏడాదికిగానూ రూ. 10 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఉన్న 10 బేస్ పాయింట్లను 2.80 శాతం మేర తగ్గించింది. దీనితో పాటు రూ. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాలపై 5 బేసిస్ పాయింట్లను 2.85 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి.