బీమా సంస్థలు కరోనా మరణాల క్లెయిమ్‌లను కూడా పరిష్కరించాల్సిందేనని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. కొవిడ్-19 మరణ దావాల విషయంలో 'ఫోర్స్ మెజర్' నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
వేగంగా పరిష్కరించాలి..
కొవిడ్-19తో చనిపోయిన వారి క్లెయిమ్‌లను... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ అత్యంత వేగంగా పరిష్కరించాలని జీవిత బీమా మండలి ఆదేశించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు 'ఫోర్స్ మెజర్'ను అమలు చేస్తారు. కరోనా మరణాలకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది.
ఎంతో మంది వినియోగదారులు ఈ విషయంలో స్పష్టత కోసం బీమా సంస్థల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. ఈ నిబంధనపై వివాదాలు, వదంతులకు తావులేదని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది. బీమా సంస్థలను ఈ విషయాన్ని తమ వినియోగదారులకు వ్యక్తిగతంగా తెలియజేయాలని ఆదేశించింది.