వర్షాకాలంలో నీరు రోడ్లపైకి చేరడం సహా.. భారీ వానలకు వరదలు వస్తుంటాయి. వరదలు వచ్చినప్పుడు వాహనాలు పాక్షికంగా, కొన్నిసార్లు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. వాహనాలు నీట మునగడం వల్ల.. మరమ్మతులు(రిపేర్) చేయాల్సిఉంటుంది. ముఖ్యంగా నీట మునిగిన వాహనాలకు ఇంజిన్ రిపేర్లు అవసరమవుతుంటాయి.
వాహనానికి బీమా ఉంది కదా అని.. క్లెయిమ్ చేసుకుందామంటే.. అందుకు బీమా సంస్థలు అంగీకరించవు. ఎందుకంటే ప్రమాదాలకు మాత్రమే బీమా ఇస్తామని, నీటమునగడం ప్రమాదంగా పరిగణించమని చెబుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారుడు సొంతంగా ఇంజిన్ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంజిన్ కాబట్టి ఖర్చు మోపెడు అవుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా.. వరదలో మునిగిన వాహనానికీ బీమా వర్తించేలా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్..
వాహనం వరద నీటిలో మునిగితే.. అందులో నీళ్లు వెళ్లిపోయే వరకు వేచి ఉండాలి. బీమా కంపెనీకి ఈ విషయాన్ని చేరవేయాలి. దీని ద్వారా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కంపెనీ సలహాలు ఇస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని పరిశీలించేందుకు దగ్గరలోని గ్యారేజీకి తీసుకెళ్లాలని కంపెనీలు సూచిస్తుంటాయి. అయితే దీనికయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. 'రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్' ఉన్నట్లయితే ఈ ఖర్చు తప్పుతుంది.
నీటిమునిగిన వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించకూడదు. అంతే కాకుండా స్థానిక మెకానిక్‌లతో రిపేర్ చేయించకూడదు.
వాటికి బీమా వర్తించదు...
భారీ వరదల కారణంగా వాహనం పూర్తిగా నీటమునిగితే.. క్యాబిన్లోకి నీరు చేరుతుంది. ఫలితంగా.. అందులో ఉండే సెన్సర్లు, స్పీకర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏమైనా ఉంటే పాడవుతాయి. ఇలాంటి సందర్భాల్లో బీమా క్లెయిమ్ అయినా.. అలాంటి ఉపకరణాలకు బీమా వర్తించదు. కేవలం కంపెనీ నుంచి వచ్చిన వాటికి మాత్రమే బీమా కల్పిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా 'యాడ్ ఆన్'లు తీసుకోవడం మంచిది. వీటితో ఉపకరణాలకు బీమా వర్తిస్తుంది. వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉన్న వారు ఈ యాడ్ ఆన్స్ తప్పనిసరిగా తీసుకోవటం మంచిది.