భారత్‌లో టీకా రేసులో ముందున్న సీరం సంస్థకు ఇటీవల ఓ చిక్కొచ్చి పడింది. సీరం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్.. తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకు పరిహారంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రకటనను సీరం సంస్థ తీవ్రంగా ఖండించింది. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ వివాదం సీరం సంస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ట్రయల్స్ కొనసాగే విషయంలో మున్ముందు జరిగే పరిణామాలు ఏంటన్న విషయంపై ప్రస్తుతం సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివాదం ఏంటంటే...
చెన్నైలోని అన్నా నగర్‌కు చెందిన 40 ఏళ్ల బిజినెస్ కన్సల్టెంట్.. సీరం సంస్థ నిర్వహించిన కొవిషీల్డ్ టీకా ట్రయల్స్‌లో పాల్గొన్నారు. టీకా తీసుకున్న పది రోజుల వరకు తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం సహా నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు చెప్పారు.
అనంతరం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వలంటీర్ తరఫు న్యాయవాది ఎన్జీఆర్ ప్రసాద్ వెల్లడించారు. ఇంతకుముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. వలంటీర్ ఆరోగ్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిందని, టీకా వల్లే ప్రస్తుతం ఆయనకు సమస్యలు తలెత్తాయని స్పష్టం చేశారు. దీనిపై సీరం సంస్థతో పాటు ఐసీఎంఆర్, ఆస్ట్రాజెనెకా(యూకే), డీజీసీఐ, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పోలార్డ్, టీకా ట్రయల్స్ నిర్వహించిన రామచంద్ర ఆస్పత్రి(చెన్నై)కి లీగల్ నోటీసులు జారీ చేశారు. వలంటీర్ అనారోగ్యానికి బాధ్యత వహించి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంస్థ స్పందన
అయితే వలంటీర్ ఆరోపణలను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఖండించింది. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు, వలంటీర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్‌పై మోపుతున్నారని మండిపడింది. డబ్బు కోసమే టీకాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. టీకాపై ఈ విధంగా ఆరోపణలు చేసిన వ్యక్తి నుంచి రూ. 100 కోట్లు వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాలను సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.
ఈ వివాదం నేపథ్యంలో టీకా ట్రయల్స్ సమర్థతపై సీరం సంస్థ మరోసారి స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్ అత్యంత సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. టీకా అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌లో అవసరమైన అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలు పాటించామని వెల్లడించింది.
టీకా ట్రయల్స్‌పై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందని చర్చలు మొదలైన వేళ ఈ విషయంపైనా సీరం సంస్థ క్లారిటీ ఇచ్చింది. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.