Infosys Results: 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి ఐటీ దిగ్గజ సంస్థలు. ఇన్ఫోసిస్ అదరగొట్టగా.. విప్రో మాత్రం అనుకున్నంత రాణించలేకపోయింది.
భారత్‌లోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్.. నికరలాభం 11.8 శాతం మేర పెరిగింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఏకీకృత నికరలాభం.. రూ. 5,809 కోట్లుగా ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో.. రూ. 5,197 కోట్లుగా ఉంది.
ఆదాయం.. 22.9 శాతం పెరిగి రూ. 31 వేల 867 కోట్లకు చేరిందని కంపెనీ స్పష్టం చేసింది. 2020-21 క్యూ3లో సంస్థ ఆదాయం.. రూ. 25 వేల 927 కోట్లుగా ఉంది.
విప్రో ప్చ్..
Wipro Results: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో 2021-22 మూడో త్రైమాసికంలో అంతలా రాణించలేదు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో.. ఏకీకృత నికరలాభం రూ. 2,969 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది కంటే ఇది 1.3 శాతం మాత్రమే ఎక్కువ.
ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. క్యూ3లో విప్రో రెవెన్యూ 29.6 శాతం పెరిగి.. రూ.20,313 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.15,670 కోట్లుగా ఉంది.
- విప్రో ఐటీ సేవల విభాగ ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 2,639.7 మిలియన్ డాలర్లుగా నమోదైనట్లు విప్రో పేర్కొంది. ఇది 2.3 శాతం వృద్ధి చెెందినట్లు స్పష్టం చేసింది.
- ఆర్డర్ బుకింగ్స్‌లో మంచి పనితీరును కనబరిచినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వరుసగా ఐదో త్రైమాసికంలోనూ సంస్థ అన్ని విభాగాల్లో రాణించినట్లు పేర్కొంది.
- ఒక్కో షేరుకు రూ. 1 డివిడెండ్ ఇస్తున్నట్లు విప్రో ప్రకటించింది.
Wipro Share Price: బుధవారం.. స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అనంతరం ఐటీ దిగ్గజాల త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి. ఇవాళ్టి సెషన్లో విప్రో షేరు 0.45 శాతం నష్టంతో 691 వద్ద ముగిసింది.