తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2021, 4:44 AM IST

Updated : Jul 15, 2021, 7:30 AM IST

ETV Bharat / business

ఇన్ఫోసిస్​లో కొలువుల జాతర- 35వేల ఉద్యోగాలకు అర్హులు వీరే..

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రూ. 5,195 కోట్ల మేర లాభాన్ని ఆర్జించినట్లు బీఎస్​ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే సంస్థ లాభాలు 2.3 శాతం పెరిగాయి. ఈ ఏడాది 35వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను తమ సంస్థలో నియమించుకోనున్నట్లు సీఓఓ వెల్లడించారు.

Infosys, Infosys result
ఇన్ఫోసిస్​కు లాభాల పంట

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 22.7శాతం ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసి రూ.5,195 కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,233 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు ఇన్ఫోసిస్‌ బీఎస్‌ఈకి అందజేసిన ఫైలింగ్‌లో తెలిపింది. ఇక క్రితం త్రైమాసికంతో పోలిస్తే లాభాలు 2.3 శాతం మేర పెరిగాయి.

కంపెనీ ఆదాయం 17.87 శాతం వృద్ధి చెంది రూ.27,896 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,665 కోట్ల ఆదాయ వృద్ధి నమోదయ్యింది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం ఆరు శాతం పెరిగింది. అయితే, ఇన్ఫీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలను 13-15 శాతంగా లెక్కగట్టారు.

ఫలితాలపై కంపెనీ సీఈఓ అండ్‌ ఎండీ సలీల్‌ పరేఖ్‌ సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ఉద్యోగుల నిబద్ధత కారణంగా వార్షిక ప్రాతిపదికన 16.9 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 4.8 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. సంస్థ డిజిటల్‌ కార్యకలాపాలు 9.7 శాతం పుంజుకున్నట్లు తెలిపారు. అయితే, కోర్‌ బిజినెస్‌ మాత్రం 0.7 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ విభాగం వాటా 53.9 శాతానికి పెరిగినట్లు తెలిపారు.

ఈ ఏడాది 35 వేల నియామకాలు..

డిజిటల్‌ రంగంలో డిమాండ్‌ పుంజుకుంటున్న కారణంగా కొత్త టాలెంట్‌ను సంస్థలో చేర్చాలనుకంటున్నట్లు సంస్థ సీఓఓ ప్రవీణ్‌ రావు తెలిపారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 35 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు.

2.7 శాతం లాభాల్లో ఇన్ఫోసిస్‌ షేర్లు..

ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు ఈరోజు 2.7 శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు విలువ 2.10 శాతం పెరిగి రూ.1577 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో షేర్‌ విలు 2.7శాతం పెరిగి రూ.1,576కి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో షేరు విలువ 26 శాతం పెరగడం విశేషం.

ఇదీ చూడండి:'ఆ సంస్థలో రూ.880 కోట్ల బ్లాక్ మనీ!'

Last Updated : Jul 15, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details