తెలంగాణ

telangana

ETV Bharat / business

Indigenous Robot : పంద్రాగస్టు నాటికి స్వదేశీ రోబో రాబోతోంది..! - తెలంగాణలో రోబో తయారీ

రానున్న రోజుల్లో మన దేశ సరిహద్దుల్లోనూ రోబోలు పహారా కాయనున్నాయి. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిఫెన్స్‌ రోబోల రూపకల్పనకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆలిండియా రోబోటిక్స్‌ అసోసియేషన్‌ శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15నాటికి రోబో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐరా ఛైర్మన్‌ పి.ఎస్‌.వి.కిషన్‌ తెలిపారు.

Indigenous Robot, robo for Patrolling
పంద్రాగస్టు నాటికి స్వదేశీ రోబో రాబోతోంది..!

By

Published : Jan 30, 2022, 9:35 AM IST

Indigenous Robot : మనుషులు చేయలేని అత్యంత క్లిష్టమైన పనులను రోబోలు చేస్తున్నాయి. భవిష్యత్తులో మన దేశ సరిహద్దుల్లోనూ రోబోలు పహారా కాయనున్నాయి. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిఫెన్స్‌ రోబోల రూపకల్పనకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆలిండియా రోబోటిక్స్‌ అసోసియేషన్‌ (ఐరా) శ్రీకారం చుట్టింది. పంద్రాగస్టు నాటికి డిఫెన్స్‌ రోబో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐరా ఛైర్మన్‌ పి.ఎస్‌.వి.కిషన్‌ ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ఇంటర్వ్యూలో తెలిపారు.

  • ఏ దేశాల సైన్యంలో రోబోలున్నాయి?

మన దేశ సరిహద్దుల్లో చైనా రోబోలను మోహరించిందనే కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్‌, అమెరికా కూడా ఎప్పటి నుంచో వినియోగిస్తున్నాయి. మన డిఫెన్స్‌ సంస్థల్లోనూ రోబోలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సైన్యంలో వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.

  • ఐరా రూపొందిస్తున్న డిఫెన్స్‌ రోబో ఎలా ఉండబోతుంది ?

ఆర్మీ ట్యాంకర్‌ మాదిరి 4.5 అడుగుల ఎత్తులో డిఫెన్స్‌ రోబో ఉంటుంది. ప్రధానంగా 3 విధులు నిర్వర్తించేలా దీన్ని డిజైన్‌ చేస్తున్నాం. మంచు, కొండలు, ఎడారి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేసేలా రూపకల్పన చేస్తున్నాం. ఆయా ప్రదేశాల్లో పహారా కాయడంతో పాటు మందుపాతరలు ఉంటే గుర్తించి అప్రమత్తం చేస్తాయి. అనుమానాస్పద వ్యక్తులు నిషిద్ధ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తిస్తే, కాల్పులు జరిపేలా డిజైన్‌ చేస్తున్నాం. ఇలా చేసే తూటాల్లో మత్తుమందు ఉంటుంది. తూటా తాకగానే ఆయా వ్యక్తులు పడిపోతారు. ఈ సమాచారం సైనికులకు వెళుతుంది. వారు వచ్చి అదుపులోకి తీసుకుంటారు.

  • సైనికాధికారుల అవసరాలు తెలుసుకున్నారా?

గతంలో పోలీసు రోబో చేసిన అనుభవం ఉంది. విశ్రాంత సైనిక అధికారులతో మాట్లాడాక, డిఫెన్స్‌ రోబో ప్రాజెక్ట్‌ ప్రకటించాం. ఒక్కసారి ప్రోటోటైప్‌ సిద్ధమయ్యాక సైనిక అధికారుల ముందు పనితీరును ప్రదర్శిస్తాం. వారి సూచనలతో తుది రోబో రూపకల్పన చేస్తాం. ఇందులో 60 శాతం ఐరా భాగస్వామ్యం ఉంటే.. మిగతా 40 శాతం ఈరంగంలోని రోబోటిక్స్‌ అంకుర సంస్థలదే.

  • మన దేశంలో ఈ రంగ విస్తృతికి ఎలాంటి అవకాశాలున్నాయి?

దేశీయ వినియోగం కంటే, ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అధిక అవకాశాలున్నాయి. రోబో తయారీ కోసం పెద్ద కంపెనీలు భారత్‌లో ప్లాంటు నెలకొల్పాలంటే, తగిన నైపుణ్యాలున్న మానవ వనరులు అవసరం. విద్యార్థి దశనుంచే ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఐరా ఆధ్వర్యంలో రోబోటిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఐరా డైరెక్టర్లు శ్రీచరణ్‌ లక్కరాజు, శ్రీనివాస్‌ మాధవం దీనిపై పనిచేస్తున్నారు. ఇందువల్ల రోబోటిక్స్‌ ఇంజినీర్లు, టెక్నీషియన్లు ఆవిర్భవిస్తారు. 2023 నాటికి అంకుర సంస్థలకు 350 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2600 కోట్ల) మార్కెట్‌ కల్పించాలని ఐరా లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, రోబోటిక్స్‌లో కలిపి వచ్చే ఐదేళ్లలో 15 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అంచనా వేస్తున్నాం.

  • ఐరా ఏర్పాటు ఆలోచన ఎలా వచ్చింది?

రోబోటిక్స్‌ విభాగంలో ఎన్నో అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో 15 వరకు ఉంటాయి. ఎవరికి వారు విడిగా పనిచేస్తున్నారు. నిధుల సమస్య ఎక్కువగా ఉంది. హార్ట్‌వేర్‌పై పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదనే విషయాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన సూచనతోనే ఐరాను నెలకొల్పాం. రోబోలు రూపొందిస్తున్న సంస్థలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి రెండేళ్ల క్రితం ఐరాని ఏర్పాటు చేశాం.

ఇదీ చదవండి:మార్చిలో ఎల్​ఐసీ ఐపీఓ.. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం

ABOUT THE AUTHOR

...view details