తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం! - వాణిజ్య వార్తలు

ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో దేశ పంచదార ఉత్పత్తి 64 శాతం తగ్గింది. నవంబర్ 15 నాటికి మొత్తం ఉత్పత్తి 4.85 లక్షల టన్నులుగా మాత్రమే ఉన్నట్లు భారత చక్కెర కర్మాగారాల సంఘం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటకలో గత నెల కురిసిన భారీ వర్షాలకు చెరుకు పంట దెబ్బతినడం.. ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు పేర్కొంది.

త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం!

By

Published : Nov 20, 2019, 7:25 PM IST

Updated : Nov 20, 2019, 8:29 PM IST

దేశంలో పంచదార ఉత్పత్తి భారీగా తగ్గింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం నవంబర్​ 15 నాటికి 64 శాతం ఉత్పత్తి తగ్గి.. 4.85 లక్షల టన్నులుగా నమోదైనట్లు భారత చక్కెర కర్మాగారాల సంఘం (ఐఎస్​ఎంఏ) తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో పంచదార ఉత్పత్తి 13.38 లక్షల టన్నులుగా ఉండటం గమనార్హం.

పంచదార మార్కెటింగ్ సంవత్సరం ఏటా అక్టోబర్​లో 1న మొదలై.. ఆ తర్వాతి ఏడాది సెప్టెంబర్​ 30తో ముగుస్తుంది.

ఉత్పత్తి తగ్గుదలకు కారణాలివే..

గత మార్కెటింగ్ సంవత్సరంలో ఇదే సమయానికి దేశవ్యాప్తంగా 310 షుగర్​ మిల్లులు పంచదార ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం 100 మిల్లులు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించిన కారణంగా ఈ వ్యత్యాసం ఏర్పడినట్లు ఐఎస్​ఎంఏ పేర్కొంది.

ముఖ్యంగా మహారాష్ట్రలోని షుగర్​ మిల్లులు ఇప్పటి వరకు ఉత్పత్తిని ప్రారంభించకపోవడం ప్రభావం చూపినట్లు ఐఎస్​ఎంఏ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన మిల్లుల్లోనే 6.31 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు గుర్తుచేసింది.

అయితే ఈ ఏడాది నవంబర్​ 15 నాటికి.. ఉత్తర్​ప్రదేశ్ మిల్లుల్లో ఉత్పత్తి 2.93 లక్షలకు పెరిగినట్లు ఐఎస్ఎంఏ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ఉత్పత్తి 1.76 లక్షల టన్నులుగా ఉంది.

కర్ణాటకలో మాత్రం పంచదార ఉత్పత్తి ఈ నెల 15 నాటికి.. 1.43 లక్షల టన్నులకు తగ్గింది. 2018లో ఇదే సమయానికి ఇక్కడ ఉత్పత్తి 3.60 లక్షల టన్నులుగా ఉండటం గమనార్హం.

గత నెలలో రెండు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు.. చెరుకు పంట భారీగా దెబ్బతింది. ఈ కారణంగా పంచదార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది.

ఈ నెల 22 నుంచి మహారాష్ట్ర మిల్లుల్లో పంచదార ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఐఎస్​ఎంఏ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లపై వ్యాపారుల 'నిరసన' గళం

Last Updated : Nov 20, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details