నివాహ గృహాల ధరల పెరగుదల ర్యాంకుల్లో భారత్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 11 స్థానాలు తగ్గింది. 'గ్లోబల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ క్యూ2 2020' ప్రకారం.. మొత్తం 56 ప్రధాన దేశాల్లో భారత్ 54వ స్థానంలో నిలిచింది.
దేశంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హౌసింగ్ ధరలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 1.9 శాతం తగ్గటం ఇందుకు కారణమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో పేర్కొంది.
నైట్ ఫ్రాంక్ నివేదిక ముఖ్యాంశాలు..
- 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ2 వార్షిక ర్యాకింగ్లలో టర్కీ ప్రథమ స్థానంలో నిలిచింది. 12 నెలల కాలంలో ఇక్కడ ఇళ్ల ధరలు 25.7 శాతం పెరిగాయి. తర్వాతి స్థానాల్లో లగ్జెంబర్గ్ (13.9 శాతం), లిథువేనియా (12.4 శాతం) ఉన్నాయి.
- హాంకాంగ్ అత్యల్ప స్థాయిలో నిలిచింది. ఇక్కడ గృహాల ధరలు 2.8 శాతం పడిపోయాయి.
- 56 ప్రధాన దేశాల్లో ఇళ్ల ధరల వార్షిక రేటు పెరుగుదల సగటున 4.7 శాతంగా ఉంది. ఇది క్యూ1లో 4.4 శాతంగా ఉంది.
- ఈ ఏడాది రెండో త్రైమాసికానికి విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి పది స్థానాల్లో.. ఎనిమిది ఐరోపా దేశాలే ఉండటం గమనార్హం.
- ఆసియా పసిఫిక్ ప్రాంతాల వారీగా చూస్తే కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న న్యూజిలాండ్, దక్షిణ కొరియా మిశ్రమ ఫలితాలను కనబర్చాయి.
- మార్చి నుంచి జూన్ మధ్య న్యూజిలాండ్ స్థానం 2 నుంచి 11కి పడిపోయింది. అయినప్పటికీ 9 శాతం వార్షిక ధరల వృద్ధితో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచింది.
- 2020 రెండో త్రైమాసికంలో దక్షిణ కొరియా 1.3 శాతం వార్షిక ధరల పెరుగుదలను కనబర్చింది.
ఇదీ చూడండి:డా.రెడ్డీస్‌కు 10 కోట్ల రష్యా టీకా డోసులు!