కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే, వీటి వల్ల ప్రభావితమయ్యే రైతులకు సామాజిక రక్షణలు కల్పించాలని సూచించారు. భారత వ్యవసాయ రంగంలో ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
కొత్త వ్యవసాయ చట్టాలు ప్రధానంగా మార్కెటింగ్ ఆధారంగా రూపొందించారని గోపీనాథ్ తెలిపారు. వీటి వల్ల కొత్త మార్కెట్లలో ఉన్న అవకాశాల్ని ఒడిసిపట్టుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. మండీలతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం చట్టాలు కల్పిస్తున్నాయన్నారు. దీనివల్ల అన్నదాతల ఆదాయం తప్పకుండా పెరుగుతుందన్నారు.