మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చూడడానికి భారీగా ఉన్నా... వాస్తవానికి అది చాలా చిన్నది అని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్ సొల్యూషన్ పేర్కొంది. జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల నిధులను ప్యాకేజీగా అందించామని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవానికి జీడీపీలో 1 శాతం మాత్రమే కేటాయించిందని ఫిచ్ కుండబద్దలు కొట్టింది.
ప్యాకేజీపై మోదీ ప్రకటన తరువాత రంగంలోకి దిగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు విడతలుగా వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించారు. తమ ప్రభుత్వం చెప్పినదాని కంటే అదనంగా కొంత కలిపి... మొత్తంగా రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిందని సగర్వంగా చెప్పారు.
వృద్ధికి ఊతం ఏది?
మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు.. తక్షణ సమస్యలను పరిష్కరించానికి ఏమాత్రం సరిపోవని ఫిచ్ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.8 శాతం వృద్ధి అంచనాలు చేరుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది.
"మోదీ సర్కార్ ప్రకటించిన కరోనా ప్యాకేజీలో సగం నిధులు... గతంలో ప్రకటించిన ఆర్థిక చర్యలకే సరిపోతాయి. ఇది చాలదన్నట్లు రూ.7 లక్షల కోట్ల నగదీకరణ చేయాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. ఆర్బీఐ ద్వారానే మిగతా ప్యాకేజీ నిధులు ఆయా రంగాలకు కేటాయిస్తామని చెబుతోంది. ప్రభుత్వం ఇలాంటి ధోరణి ప్రదర్శించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఒనగూరేది ఏమీ లేదు."
- ఫిచ్ సొల్యూషన్స్