Gold Demand India: కొవిడ్ పరిణామాలున్నా, గతేడాది దేశంలో 797.3 టన్నుల బంగారం వినిమయం అయ్యిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగు పడటంతో గిరాకీ అధికమైందని, ఈ ఏడాదీ సానుకూలంగానే ఉంటుందని పేర్కొంది.
2020లో దేశీయంగా 446.4 టన్నుల బంగారానికే గిరాకీ లభించినందున, దానితో పోల్చితే 2021లో 78.6 శాతం వృద్ధి లభించిందని 'పసిడి గిరాకీ ధోరణులు-2021' నివేదికలో వెల్లడించింది.
పండుగల సీజన్‌కు తోడు వివాహాలు అధికంగా చోటుచేసుకున్న అక్టోబరు-డిసెంబరులోనే 343 టన్నుల బంగారానికి గిరాకీ లభించింది. ఇందులో ఆభరణాల వాటాయే 265 టన్నులని, ఇదే పరిశ్రమకు అత్యుత్తమ త్రైమాసికంగా నిలిచిందని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సోమసుందరం పేర్కొన్నారు. తమ గరిష్ఠ అంచనాలను మించి డిసెంబరు త్రైమాసికంలో గిరాకీ లభించిందని వెల్లడించారు.
ఈ ఏడాది పసిడికి గిరాకీ కొవిడ్ ముందుస్థాయికి చేరినా కూడా, 2021 అక్టోబరు-డిసెంబరు నాటి వినియోగస్థాయి లభించకపోవచ్చని వివరించారు. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల కోసం 79 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని, ఇది 8 ఏళ్ల గరిష్ఠస్థాయిగా పేర్కొన్నారు. 2021లో ఆభరణాలకు లభించిన గిరాకీ ఆరేళ్ల గరిష్ఠస్థాయిగా తెలిపారు. తక్కువమందితో శుభకార్యాలు నిర్వహించినందున, ఆదా అయిన మొత్తంతో బంగారం కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు.