కొవిడ్ ముందు వరకు పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ ప్రతి నెలా పెరుగుతూ వచ్చేది. ఒక నెల వినియోగాన్ని, అంతకుముందు ఏడాది అదే నెల గిరాకీతో పోల్చి ఎంత వృద్ధి లభించిందీ ఇంధన సంస్థలు వెల్లడిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి పరిస్థితులు మారాయి. ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉన్న సమయంలో, ఇంధనానికి గిరాకీ బాగా తగ్గింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలైన ఏప్రిల్ అయితే ఇంధన గిరాకీ 49 శాతం తగ్గడం గమనార్హం.
కరోనా తర్వాత ఇంధన గిరాకీలో వార్షిక వృద్ధి
దేశంలో అన్‌లాక్ మొదలైన తర్వాత ఇంధన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్ నెలలో ఇంధన గిరాకీలో వార్షిక వృద్ధి నమోదైంది. కొవిడ్ సంక్షోభం ఆరంభమయ్యాక ఒక నెలలో వార్షిక వృద్ధి లభించడం ఇదే తొలిసారి. పండుగ సీజన్ వల్ల ప్రజా-సరకు రవాణా వాహనాల రాకపోకలు అధికమై, డీజిల్ వినియోగం కొవిడ్ ముందటి స్థాయికి చేరడమే ఇందుకు కారణం.
మే నుంచి అన్‌లాక్ ప్రారంభమయ్యాక, క్రమంగా ఇంధనానికి గిరాకీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019 అదే నెలలతో పోలిస్తే వార్షిక వృద్ధి మాత్రం లభించలేదు. పండుగ సీజన్ రావడంతో గత నెల (అక్టోబరు)లో ఇంధన గిరాకీ 2.5 శాతం అధికమై 17.77 మిలియన్ టన్నులకు చేరింది. 2019 అక్టోబరులో 17.34 మిలియన్ టన్నుల ఇంధనమే వినిమయమైంది. కొవిడ్ సంక్షోభం ఆరంభమయ్యాక, ఒక నెలలో వార్షిక వృద్ధి లభించడం ఇదే తొలిసారి. పండుగ సీజన్ కావడంతో, ప్రజా-సరకు రవాణా వాహనాల రాకపోకలు అధికమై, డీజిల్ వినియోగం కొవిడ్ ముందటి స్థాయికి చేరడమే ఇందుకు కారణం. వ్యక్తిగత రవాణా వల్ల పెట్రోల్ వినియోగం సెప్టెంబరులోనే కొవిడ్ ముందటి స్థాయికి చేరింది. విద్యా సంస్థలు ప్రారంభమైతే, ఇంధన గిరాకీ మరింత పెరుగుతుంది.
- పరిశ్రమల్లో విద్యుదుత్పత్తికి ఇంధనంగా, పెట్రో రసాయనాల తయారీకి వినియోగిస్తున్న నాఫ్తాకు గిరాకీ 15 శాతం అధికమై 13 లక్షల టన్నులకు చేరింది.
- రోడ్ల నిర్మాణాల్లో వాడే తారు వినియోగం 48 శాతం వృద్ధితో 6.62 లక్షల టన్నులకు చేరింది.
- లాక్‌డౌన్ సమయంలో గిరాకీ తగ్గని వంటగ్యాస్ వినిమయం కూడా అక్టోబరులో 3 శాతం వృద్ధితో 24 లక్షల టన్నులుగా నమోదైంది.
- విమానయాన సంస్థలు 50-60 శాతం సర్వీసులే నిర్వహిస్తున్నందున, జెట్ ఇంధన గిరాకీ సగానికి పరిమితమై 3.55 లక్షల టన్నులకు పరిమితమైంది.