భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతోంది. సామాన్యులకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు(Data Consumption In India) ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. ఆయన గతంలో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున(Data Consumption In India) వాడుతున్నారని చెప్పారు. ప్రతిష్ఠాత్మక 'డిజిటల్ ఇండియా' విజన్ సాకారం దిశగా.. ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత్ మార్కెట్‌లోకి వస్తున్నాయని వెల్లడించారు.
"ప్రస్తుతం భారత్‌లో 118 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 60 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. 70 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన కనెక్టివిటీ బేస్ ఉంది. గత ఆరేడేళ్లలో అనుసంధాన రంగంలో మంచి పురోగతి సాధించాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), ఆధార్, కొవిన్ తదితర డిజిటల్ ఇండియా కార్యక్రమాలు చాలా వరకు ప్రజల జీవితాలను మార్చాయి."
-ఆర్‌ఎస్ శర్మ, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ