దేశంలో కొన్ని రోజులుగా చైనా వస్తువులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిహద్దు వెంట చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దీనికి మరింత మద్దతు పెరిగింది. ఈ పరిణామం స్వదేశీ సంస్థలకు కలిసొచ్చే అంశమే అయినా.. అన్ని రంగాల్లో చూస్తే ఇది పెద్దగా అనుకూలమేమీ కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు.
చైనా వస్తువులపై వ్యతిరేకత వల్ల దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలకు కలిసొస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల వాదన మాత్రం మరోలా ఉంది.
నిధుల కొరత..
"ప్రారంభంలో ఈ పరిణామాలు ఉత్సాహం కలిగిస్తాయి. అయితే భారీగా నిధులున్న చైనా సంస్థలను ఎదుర్కోవాలంటే.. భారతీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలకు లో-కాస్ట్ ఫండ్స్ కావాలి." అని కార్బన్ మాతృసంస్థ జైనా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ గార్గ్ అభిప్రాయపడ్డారు. లేదంటే ఆ సంస్థలకు పోటీ ఇవ్వడం కష్టమైన పనేనని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సరైన ప్రణాళికతో ముందుకు సాగితేనే దేశీయ బ్రాండ్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనా కంపెనీల రాకతో గత కొన్నాళ్లుగా దేశీయ సంస్థలు భారీగా కుదేలయ్యాయి. మరికొన్ని సంస్థలు విదేశీ కంపెనీలకు విడి భాగాల సరఫరదారులుగా నిలిచిపోయాయని ఆయన గుర్తు చేశారు.