గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 18శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఫార్మాస్యుటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) తెలిపింది. ఈ వృద్ధితో ఎగుమతుల మొత్తం విలువ 24.44 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 20.58 బిలియన్ డాలర్లుగా ఉంది.
"ఈ ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు బాగా పెరిగాయి. 2021 మార్చిలో 2.3 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంలోని అన్ని నెలల కన్నా పెద్దమొత్తం. అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధిరేటు 48.5 శాతంగా నమోదైంది."
-ఉదయ్ భాస్కర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫార్మెక్సిల్