తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 4:30 PM IST

ETV Bharat / business

ఆర్థిక సవాళ్లు, వృద్ధి క్షీణత తప్పవు: మూడీస్​

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి క్షీణిస్తుందని మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని తెలిపింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20.9 లక్షల కోట్ల ప్యాకేజీలో నిజానికి జీడీపీలో 1 నుంచి 2 శాతం మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు ఉద్దేశించినదని స్పష్టం చేసింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు ఒనగూరేది ఏమీ లేదని స్పష్టం చేసింది.

Indian economy to contract in FY21:  Moody's
భారత్​కు ఆర్థిక సవాళ్లు, వృద్ధి క్షీణత తప్పవు: మూడీస్​

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ నేపథ్యంలో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి క్షీణిస్తుందని మూడీస్​ ఇన్వెస్టర్స్ సర్వీస్​ అంచనా వేసింది. మందగించిన ఆర్థిక కార్యకలాపాలు, ద్రవ్యోల్బణం, నామమాత్రపు వేతన వృద్ధి మొదలైన కారణాల వల్ల... ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని వివరించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కంటే ముందే.. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని మూడీస్ గుర్తు చేసింది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు తీవ్ర నిరాశను మిగిల్చిన నేపథ్యంలో.. ఇకపై ఆర్థిక సవాళ్లు మరింతగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడింది.

"భారతదేశ వృద్ధి (రియల్ జీడీపీ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో రుణాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం."

- మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​

అసంఘటిత రంగానికి సవాల్​

కరోనా నియంత్రణ కోసం నాలుగు విడతలుగా లాక్​డౌన్ పొడిగించడం వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతోందని మూడీస్ పేర్కొంది. ఈ ప్రభావం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.

దేశ జీడీపీలో సగానికి పైగా సమకూరుస్తున్న అసంఘటిత రంగం... లాక్​డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిందని మూడీస్ వివరించింది.

మొదటి దశ లాక్​డౌన్​ వల్ల అల్పాదాయ వర్గాలు, రోజువారీ వేతన కూలీలు తీవ్రంగా ప్రభావితం అయ్యారని తెలిపింది. ప్రస్తుతం నాలుగో దశ లాక్​డౌన్​లో.. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా... ఆదాయాలు తగ్గినందున గృహ వినియోగం తగ్గే అవకాశముందని హెచ్చరించింది.

మోదీ ఉద్దీపనతో కష్టమే..

ఆర్థిక వ్యవస్థ స్వావలంబన కోసమని మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీపై మూడీస్ సునిశిత విమర్శలు చేసింది. నిజానికి మోదీ ప్రభుత్వం జీడీపీ 10 శాతం నిధులను ఖర్చు చేయడంలేదని... 1 నుంచి 2 శాతం మాత్రమే ఉద్దీపనలుగా ప్రకటించిందని మూడీస్​ తేల్చిచెప్పింది. అందువల్ల ప్రభావిత రంగాల ద్రవ్య సమస్యలను ఈ ప్యాకేజీ పరిష్కరించలేదని స్పష్టం చేసింది.

అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 3.5 శాతం కేంద్ర ప్రభుత్వ లోటు బడ్జెట్​ లక్ష్యం కూడా నెరవేరకపోవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల ఆర్థిక వ్యవస్థకు చేటు కలుగుతుందని మూడీస్ స్పష్టం చేసింది.

తిరోగమనంలో...

వాహన రంగం, చమురు, గ్యాస్, మైనింగ్ కంపెనీలు తిరోగమనంలో ఉన్నాయని మూడీస్ తెలిపింది. వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్, సరఫరాకు అంతరాయాల వల్ల కార్పొరేట్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. నిత్యవసర వస్తు, సేవలు అందించే సంస్థలకు కూడా పెద్దగా లాభాలు ఉండవని స్పష్టం చేసింది.

విద్యుత్, రవాణా రంగాలకు డిమాండ్ తగ్గడం వల్ల ఆ రంగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని స్పష్టం చేసింది. వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల నష్టపోతున్నాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'మారటోరియం ఉందని ఈఎంఐ వాయిదా వేస్తే ఇబ్బందే!'

ABOUT THE AUTHOR

...view details