తెలంగాణ

telangana

ETV Bharat / business

జయ జయ జీడీపీ- మాంద్యం నుంచి బయటకు - GDP in Q3 news

Indian economy to contract by 8 pc in 2020-21: Govt estimates
2020-21లో 8% క్షీణించనున్న జీడీపీ!

By

Published : Feb 26, 2021, 5:54 PM IST

Updated : Feb 27, 2021, 11:24 AM IST

17:50 February 26

2020-21లో 8% క్షీణించనున్న జీడీపీ!

వరుసగా రెండు త్రైమాసికాల క్షీణత కారణంగా ఏర్పడ్డ సాంకేతిక మాంద్యం నుంచి భారత్‌ బయటపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సానుకూల వృద్ధి నమోదు చేసింది. అక్టోబరు-డిసెంబరులో సానుకూల వృద్ధి నమోదు చేసిన అతికొద్ది ప్రధాన ఆర్థిక దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలిచింది. ‘వి’ ఆకారపు రికవరీ ప్రారంభమైందని.. ఇక వేగం అందుకోవడమే తరువాయి అని ప్రభుత్వం అంటోంది. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. అక్టోబరు-డిసెంబరు 2020లో స్థూల దేశీయోత్పత్తి 0.4 శాతం మేర వృద్ధి చెందింది. 2019-20 ఇదే సమయంలో జీడీపీ వృద్ధి 3.3 శాతంగా ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో 24.4 శాతం; రెండో త్రైమాసికంలో 7.3 శాతం మేర ఆర్థిక వ్యవస్థ డీలా పడ్డ సంగతి తెలిసిందే. తాజా గణాంకాలతో దేశంలో సాంకేతిక మాంద్యం ముగిసిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి రాణించాయ్‌

వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు మంచి పనితీరు ప్రదర్శించడంతో అక్టోబరు-డిసెంబరులో వృద్ధి రాణించింది. వ్యవసాయ రంగం 3.9% మేర; తయారీ రంగం 1.6 శాతం మేర ముందుకెళ్లాయి. నిర్మాణ రంగం 6.2% మేర వృద్ధి చెందగా.. విద్యుత్‌, గ్యాస్‌, నీటిసరఫరా, ఇతర వినియోగ సేవలు 7.3 శాతం పెరిగాయి. కరోనా కారణంగా వాణిజ్యం, హోటళ్ల పరిశ్రమ మాత్రం 7.7 శాతం మేర క్షీణించింది.

రూ.36.02 లక్షల కోట్లకు..

2011-12 స్థిర ధరల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ రూ.36.22 లక్షల కోట్లకు చేరుకుంది. 2019-20 ఇదే మూడు నెలల కాలంలో నమోదైన     రూ.36.08 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 0.4 శాతం అధికం. వాస్తవ లెక్కల ప్రకారం..2020-21లో జీడీపీ రూ.134.09 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. అంటే 2019-20తో పోలిస్తే 8 శాతం తక్కువ అన్నమాట.
తలసరి ఆదాయం రూ.85,929: 2011-12 ధరల ప్రకారం చూస్తే.. 2020-21లో దేశంలో తలసరి ఆదాయం రూ.85,929గా నమోదు కావొచ్చని అంచనా వేసింది. 2019-20లో నమోదైన రూ.94,566తో పోలిస్తే ఇది 9.1 శాతం తక్కువ. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే..2020-21లో తలసరి ఆదాయం అంతక్రితం ఏడాది నమోదైన రూ.1,34,186తో పోలిస్తే 4.8 శాతం తగ్గి రూ.1,27,768కి చేరొచ్చని అంచనా.

క్షీణత అంచనాలు పెరిగినా..

మరో వైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) మొత్తంమీద జీడీపీ 7.7 శాతం మేర క్షీణిస్తుందని  తొలి అంచనాల్లో తెలిపిన ఎన్‌ఎస్‌ఓ.. తాజాగా విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో మాత్రం 8 శాతం మేర డీలా పడుతుందని అంచనా వేసింది. కరోనా ప్రభావం ఇందులో ప్రతిఫలిస్తోంది. భారత్‌ వి-ఆకారంలో రికవరీ అవుతోందని చెప్పడానికి, కరోనా ముందు స్థాయిలకు వెళుతుందని విశ్వసించడానికి ఈ గణాంకాలు మద్దతు నిస్తున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది.

జనవరిలో మౌలికమూ రాణించింది

జనవరిలో 8 కీలక రంగాలు 0.1 శాతం మేర వృద్ధి చెందాయి. ఎరువులు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లో ఉత్పత్తి పెరగడం ఇందుకు నేపథ్యం. 2020 జనవరిలో కీలక ఎనిమిది రంగాలు 2.2 శాతం మేర రాణించడం విశేషం. ఈ జనవరిలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంటులో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఎరువులు, ఉక్కు, విద్యుత్‌లు వరుసగా 2.7%, 2.6%, 5.1% మేర పెరిగాయి. 2020-21 ఏప్రిల్‌-జనవరిలో మౌలిక రంగం 8.8 శాతం క్షీణించింది. 2019-20 ఇదే సమయంలో 0.8 శాతంమేర వృద్ధి చెందింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో కీలక ఎనిమిది రంగాలకు 40.27 శాతం వాటా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీలో వృద్ధి 0.5-1.5 శాతం మధ్య స్తబ్దుగా నమోదుకావొచ్చని అంచనా వేశారు.

Last Updated : Feb 27, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details