ఆర్థిక మాంద్యం మళ్లీ పడగ విప్పుతుందా? ఇప్పుడు ప్రపంచం అంతటినీ కలవరపెడుతోన్న ఓ పెద్ద ప్రశ్న ఇది. ఈ సమస్య భారత్నూ వేధిస్తోంది. అయితే మరేం ఫర్వాలేదు. వ్యక్తిగతంగా, సంయుక్తంగానూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మందగమనాన్ని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఇంకా ఉండనే ఉంది.
భారత్ విషయానికి వస్తే
ప్రభుత్వ గణాంకాలు, ఆర్బీఐ వార్షిక నివేదికలు.. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని, సమస్యలను తేటతెల్లం చేస్తాయి. ఆర్బీఐ వార్షిక నివేదిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. అదేమంటే... దేశంలో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని. ఇది సంతోషకరమైన విషయమే.
మరైతే ఆందోళన చెందాల్సిన విషయం ఒకటుంది. ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే ప్రస్తుత మందగమనం మరింత తీవ్రమై... పెను సమస్యగా మారే ప్రమాదం ఉంది.
అంతర్గత, బాహ్య కారకాలు
ఆసియా, ఐరోపా, దక్షిణ అమెరికా దేశాలతో పోల్చితే భారత్ ఎప్పుడూ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా లేదు. మనది పూర్తిగా అంతర్గత వినియోగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అందువల్ల మన దేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు అవి తెరమీదకు వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తోడు, ప్రపంచ ప్రతికూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో దేశ అంతర్గత బలహీనతలు బయటపడుతున్నాయి.
మందగమనం చక్రీయమా? నిర్మాణాత్మకమా?
ప్రస్తుత మందగమనం కాలానుగుణంగా తిరిగి మళ్లీమళ్లీ వచ్చే ప్రక్రియా? లేదా దీర్ఘకాలంపాటు వేధించే నిర్మాణాత్మక మాంద్యానికి దారితీస్తుందా? అనేది ప్రస్తుత ప్రశ్న.
ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... వర్షాలు, వరదలు సహా కాలానుగుణ కారకాలు అన్నీ కలిపి చూస్తే ఈ మందగమనం... చక్రీయమూ, అలాగే నిర్మాణాత్మకమూ అనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న సమాచారంతో దీన్ని రూఢీగా చెప్పలేము. పండుగ సీజన్ ముగిసిన తరువాత మాత్రమే దీనిపై మరింత స్పష్టత వస్తుంది. మందగమనం జనవరి చివరిలో కూడా కొనసాగితే... ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే.
వివిధ రంగాల క్షీణత
వాహన అమ్మకాల క్షీణత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2020 మార్చి నాటికి బీఎస్-6 వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. కాలం చెల్లిన మోడళ్ల ఉత్పత్తిని వాహనతయారీ సంస్థలు నిలిపివేశాయి. అలాగే గృహ, ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్ రంగాలూ నష్టాలు చవిచూస్తున్నాయి.
సమస్య ఇలా ప్రారంభమైంది
పై విషయాలు అన్నీ గమనిస్తే.. సమస్య ఎక్కడ ఉంది? ఆర్థిక మందగమనం ఎందుకు ఉంది? అనే ప్రశ్న వస్తుంది. కానీ సమస్య చాలా వాస్తవమైనది. ఇది రోజురోజుకూ తీవ్రమవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ మాంద్యం మొదలైంది. సాధారణంగా ఎన్నికలు... ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందిస్తాయి. కానీ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు, లోపభూయిష్ట జీఎస్టీ అమలుతో సమస్య ప్రారంభమైంది.
అప్పుల ఊబిలోకి.. గృహరంగం
నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ముఖ్యంగా గృహస్థులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థూల జాతీయ పొదుపులో 19.2 శాతం మేర గృహస్థుల పొదుపు క్షీణించింది. 2014-15లో ఈ జీఎన్డీఐ 16.9 శాతం కనిష్ఠానికి పడిపోయింది. 2017-18లో స్వల్పంగా (17 శాతం) వరకు కోలుకుంది.
అదే సమయంలో గృహరంగ అప్పులు ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నాయి. 2015-16లో 2.7 శాతం ఉన్న అప్పులు, 2017-18 నాటికి 4.3 శాతానికి (జీఎన్డీఐ) చేరుకున్నాయి. అలాగే వ్యక్తిగత రుణాలు 2014 మార్చి నుంచి రూ.10.36 లక్షల కోట్ల నుంచి 2019 జూన్ నాటికి 22.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
అనవసర ఖర్చులు
మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలకు కాకుండా విలాసాలకు ఖర్చులు పెట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో భోజనం, సెలవులకు విహార యాత్రలకు వెళ్లడం, అవసరం లేని విలాస వస్తువులు కొనుగోళ్లు చేయడం వంటివి చేస్తున్నారు. ఇది అవసరాల కంటే కోరికలు తీర్చుకోవడానికే ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం చేస్తోంది. అంటే వారి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా వారి పొదుపు గణనీయంగా పడిపోతోంది.
ఉత్పాదక, సేవా రంగాలు
ఉత్పాదక రంగం అప్పులు 2014 నుంచి నేటి వరకు 15 శాతం మాత్రమే పెరిగాయి. అంటే 2014 మార్చి నాటికి రూ.25.22 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2019 నాటికి రూ.28.58 లక్షలకు మాత్రమే చేరుకున్నాయి. ఇదే సమయంలో సేవల రంగం అప్పులు మాత్రం 2014 నుంచి 2019 మధ్య రూ.13.27 లక్షల కోట్ల నుంచి రూ.24.15 లక్షల కోట్లకు పెరిగాయి.
బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా?
బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్న వాదనలో కొంత మేరకు మాత్రమే నిజం ఉంది. నిరర్థక ఆస్తులు-ఎన్పీఏ సమస్య ఉన్నప్పటికీ బ్యాంకులు సమృద్ధిగా నగదు కలిగి ఉన్నాయని ఎస్బీఐ ఛైర్మన్ ఇటీవల చెప్పడం గమనార్హం. అయితే ఎన్పీఏల పెరుగుదల గురించి బ్యాంకులు ఆందోళన చెందుతున్నందున కొంచెం జాగ్రత్తగా ఉంటున్న మాట వాస్తవం.
డిమాండ్ లేకనే..