తెలంగాణ

telangana

ETV Bharat / business

Indian brands Foreign names: పేరు విదేశీ... సంస్థ స్వదేశీ - లా ఒపాలా

Indian brands Foreign names: పీటర్‌ ఇంగ్లండ్‌, లూయీ ఫిలిప్‌, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, లాక్మె.. ఈ పేర్లను మీరు వినే ఉంటారు. ఇవన్నీ ఖరీదైన విదేశీ బ్రాండ్లు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ సంస్థలు పూర్తిగా మన దేశానికి చెందినవేనని మీకు తెలుసా?

indian brands foreign names
indian brands foreign names

By

Published : Jan 30, 2022, 11:16 AM IST

Indian brands Foreign names: కొన్ని కంపెనీల ఉత్పత్తులకు మన దగ్గర బాగా ప్రాచుర్యం ఉంటుంది. కానీ వాటి పేర్లు వినగానే ఇది విదేశీ బ్రాండ్‌ ఏమో అనిపిస్తుంది. కెఫె కాఫీడే, పీటర్‌ ఇంగ్లండ్‌, లూయీ ఫిలిప్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌రోవర్‌... లాంటివి అలాంటివే. కానీ ఇవి అసలు సిసలైన భారతీయ కంపెనీలే. ఆ విశేషాలేంటో చూద్దామా...

పీటర్‌ ఇంగ్లండ్‌

పీటర్ ఇంగ్లండ్

Peter England Indian brand: పేరులోనే ఇంగ్లండ్‌ ఉంటే ఎవరు మాత్రం ఇది ఇంగ్లండ్‌కి చెందిన కంపెనీ అనుకోకుండా ఉంటారు. మీరూ అలాగే అనుకుంటే పొరబడినట్లే. అలాగే లూయీ ఫిలిప్‌... ఫ్రెంచి రాజు పేరు కాబట్టి ఇది ఫ్రెంచి బ్రాండ్‌ ఏమో అనుకుంటుంటారు. కానీ ఈ రెండింటినీ ప్రారంభించింది ఆదిత్యా బిర్లా గ్రూపే. ఇవే కాదు, వాన్‌ హుసేన్‌, అలెన్‌ సోలీ... లాంటివి కూడా ఆదిత్యా బిర్లా గ్రూపువే. వాన్‌ హుసేన్‌ని 18వ శతాబ్దంలో అమెరికాకు చెందిన ఫిలిప్‌ కుటుంబం ప్రారంభించింది. అలెన్‌ సోలీని 1774లో ఇంగ్లండ్‌లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ రెండు బ్రాండ్లనూ ఆదిత్యా బిర్లా గ్రూపు సొంతం చేసుకుంది.

డా మిలానొ

డా మిలానో

Da lamino which country: ఖరీదైన లెదర్‌ హ్యాండ్‌ బ్యాగులూ యాక్సెసరీలను అమ్మే 'డా మిలానొ' పేరుని వింటే ఎవరైనా అది ఇటలీకి చెందిన సంస్థ అనే అనుకుంటారు. ఇటలీలోని మిలాన్‌ ప్రపంచ ఫ్యాషన్‌ రాజధాని మరి. అక్కడ చాలా మంది తమ ఇంటి పేరుని మిలానో అని పెట్టుకుంటారు. ఇక, డా మిలానొ కంపెనీ వెబ్‌సైట్‌లో బ్రాండ్‌ పేరు కింద 'ఇటాలియా' అని కనిపించే అక్షరాలు కూడా అది ఇటలీ కంపెనీయే అని రూఢీ చేసేస్తాయి. అయితే, ఇది కూడా ముమ్మాటికీ భారతీయ కంపెనీనే. 1989లో దిల్లీలో ప్రారంభమైంది.

లా ఒపాలా...

లా ఒపాలా

ఖరీదైన టేబుల్‌వేర్‌కి ప్రాచుర్యం పొందిన 'లా ఒపాలా' కూడా పేరుకి ఫ్రెంచిదే అయినా కంపెనీ మాత్రం మనదే. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీని సుశీల్‌ ఝన్‌ఝన్‌వాలా 1987లో ప్రారంభించారు. మన దేశంతో పాటు ఎన్నో ఆసియా దేశాల్లో ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది.

లాక్మె...

లాక్మె

Lakme cosmetics country name: సౌందర్య ఉత్పత్తులనగానే గుర్తొచ్చే బ్రాండ్‌ 'లాక్మె'. ఫ్రెంచి నాటకం 'లాక్మె' స్ఫూర్తితో ఈ పేరుని పెట్టారు కానీ ఇది 1952లో మనదేశంలో ప్రారంభించిన కాస్మెటిక్‌ బ్రాండ్‌. అప్పట్లో విలువైన విదేశీ కరెన్సీని భారతీయ వనితలు సౌందర్య ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తున్నారని తెలిసి కాస్మెటిక్స్‌ కంపెనీని ప్రారంభించమని స్వయంగా ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూనే జేఆర్‌డీ టాటాను కోరారట. అలా లాక్మె మొదలైంది. అన్నట్లూ ఇది ఫ్రెంచి పేరే కానీ హిందూ దేవత 'లక్ష్మి' పేరునే కాస్త మార్చి ఫ్రెంచి నాటకంలో లాక్మెగా పెట్టారట. ప్రస్తుతం హిందూస్థాన్‌ యూనీలీవర్‌ అధీనంలో ఉన్న ఈ కంపెనీ భారత్‌లో నంబర్‌ వన్‌ కాస్మెటిక్‌ బ్రాండ్‌. విదేశాల్లోనూ ఎంతో పేరుంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

రాయల్ ఎన్​ఫీల్డ్

ఈ బైక్‌ ఎక్కి నడుపుతుంటే ఎవరికి వారు రాజులానే ఫీలవుతారు. 1901లో మొదలై ఇప్పటికీ ఉత్పత్తుల్ని కొనసాగిస్తున్న మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ఇదే. అయితే, ఒకప్పుడు బ్రిటిష్‌ కంపెనీ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ని భారత్‌కు చెందిన ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ సంస్థ పాతికేళ్ల కిందట సొంతం చేసుకుంది.

కెఫె కాఫీడే...

కెఫె కాఫీడే

ఏటా ఆరు దేశాల్లో 160 కోట్ల కప్పుల కాఫీలను అందిస్తోందట కెఫె కాఫీ డే చెయిన్‌. మనదేశంతో పాటు ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, మలేషియా, నేపాల్‌, ఈజిప్టుల్లో శాఖలున్న కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ ప్రారంభమైంది కర్ణాటకలో. ఈ సంస్థ చిక్కమగళూరులోని 20వేల ఎకరాల్లో స్వయంగా కాఫీ గింజలను పండిస్తోంది.

జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌...

జాగ్వార్ ల్యాండ్ రోవర్

వేగానికీ విలాసానికీ మారుపేరైన లగ్జరీ కార్లు జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్లు కూడా విదేశీ కంపెనీలవే అనుకుంటారు చాలామంది. నిజానికి ఇవి బ్రిటన్‌కి చెందిన జాగ్వార్‌ల్యాండ్‌రోవర్‌ కంపెనీకి చెందినవే. కానీ 2008లో ఈ కంపెనీని టాటా మోటార్స్‌ సొంతం చేసుకుంది.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ...

మన దేశాన్ని తెల్ల దొరల పాలనలోకి నెట్టిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరు తెలియని వారెవరు... కాకపోతే ఇప్పుడున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ మాత్రం బ్రిటిషర్లది కాదు. లండన్‌కు చెందిన ప్రవాస భారతీయ వ్యాపారి సంజీవ్‌ మెహతా ఈ కంపెనీ పేరుని 2005లో కొన్నాడు. ప్రస్తుతం ఈ కంపెనీ విలాసవంతమైన వస్తువులూ, బహుమతులూ, టీ, చాకొలెట్లను అమ్ముతోంది. ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కదూ ఈ స్వదేశీ కంపెనీల విదేశీ పేర్లు!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:పంద్రాగస్టు నాటికి స్వదేశీ రోబో రాబోతోంది..!

ABOUT THE AUTHOR

...view details