దేశంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఇంధన ధరలకు కళ్లెం (Petrol Price reduce news) వేసేలా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కసరత్తులు చేస్తోంది. చమురు ఉత్పత్తి దేశాల ఇంధన మంత్రుల సమావేశం (Ceraweek Conference) దిల్లీలో జరగనున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలను తగ్గించేలా (Petrol price reducing) వీరిని కోరే అవకాశం ఉంది. ధరలు తగ్గించాలని ఒపెక్ దేశాలతో పాటు చమురు ఉత్పత్తి చేసే దేశాలను కోరుతూనే ఉన్నామని పెట్రోలియం శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని దిల్లీలో జరిగే సమావేశంలోనూ ప్రస్తావిస్తామని చెప్పారు.
'ధరలు తగ్గిస్తే చమురు ఉత్పత్తి దేశాలకూ ప్రయోజనకరమని మేం చెబుతూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల రికవరీ స్తబ్దుగా ఉంటే.. ఇంధన డిమాండ్ పడిపోతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు (Crude Oil Price) పడిపోతాయి. అది ఆయిల్ ఉత్పత్తి దేశాలకు మంచిది కాదు' అని ఈటీవీ భారత్తో పెట్రోలియం శాఖ అధికారులు వెల్లడించారు.
మోదీ చర్చలు
ప్రపంచంలో చమురును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు.. దిల్లీలో అక్టోబర్ 20-22న సమావేశం కానున్నాయి. సెరా వీక్ కాన్ఫరెన్స్ (Ceraweek global energy) కోసం ఆయా దేశాల ఇంధన శాఖ మంత్రులు, చమురు సంస్థల ప్రతినిధులు భారత్కు రానున్నారు. భారత్ తరఫున పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి అనుబంధంగా నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దిగ్గజ చమురు సంస్థల సీఈఓలు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశమవుతారని ప్రధాని కార్యాలయం తెలిపింది. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, భారత్లోని హైడ్రోకార్బన్ రంగంలో ఉత్పత్తి, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు రానున్నట్లు వెల్లడించింది.