భారత ఆర్థిక వ్యవస్థ 2025లోగా ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాబోయే 25-30 ఏళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం వ్యాపార, అంకుర సంస్థలకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 'కానీ మన ముందున్న సవాల్‌ను అంగీకరించాలి. 2047లో వందో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరించగలమా?' అని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వర్చువల్ సదస్సులో ప్రశ్నించారు.
అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో అత్యత విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ను నేడు ప్రపంచం చూస్తోందని పీయూష్ అన్నారు. 'ఈరోజు ఈ అవకాశాన్ని మనం అందుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఇది మన బాధ్యత. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్‌ను మన మంత్రం, స్ఫూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలి' అని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో సంబంధాలు మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు.