భారత్ - అమెరికాల మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని, అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 'యూఎస్-ఇండియా ఫోరం: పార్ట్నర్స్ ఫర్ గ్రోత్' సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
పరస్పర లాభం
నూతన వాణిజ్య ఒప్పందం వల్ల ఇరుదేశాలకు లాభం చేకూరుతుందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధునాతన సాంకేతికత వల్ల భారత్కు, ప్రతిభకు వనరుగా ఉన్న తమ వల్ల అగ్రరాజ్యానికి లాభం చేకూరుతుందని ఆయన అన్నారు.
లక్ష్యం
2022 నాటికి ప్రతి కుటుంబానికి 24 గంటల విద్యుత్, వంట గ్యాస్, అంతర్జాల సౌకర్యం, మంచి విద్య, వైద్యం అందుబాటులో ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పీయూష్ తెలిపారు. అలాగే భారత దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.