భారత ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ కంపెనీలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి వీలుగా వాణిజ్య షరతులతో ముసాయిదా సిద్ధం చేసినట్లు చమురు శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు సడలించినట్లయితే ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలును తిరిగి ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలు వియన్నాలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చమురు ధరల విషయంలో భారత్, సౌదీ అరేబియాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూడాలని రిఫైనరీలకు ఇటీవలే కేంద్రం సూచించింది. అమెరికాలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కూడా ఇరాన్‌పై ఆంక్షలు సడలిస్తున్నందన్న అంచనాలున్నాయి.
ఇది జరగ్గానే భారత్ కొనుగోళ్లు ప్రారంభిస్తుందని సమాచారం. ఒకప్పుడు ఇరాన్ చమురుకు అతిపెద్ద రెండో వినియోగదారుగా ఉన్న భారత్ మళ్లీ ఆ దేశం నుంచి కొనుగోళ్లకు సిద్ధపడుతోంది. ఈ విషయంపై స్పందించేందుకు ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు నిరాకరించారు.