కార్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు.. ఇలా చాలా వరకు ఉపకరణాల్లో సెమీకండక్టర్లు లేదా చిప్‌లనేవి అంతర్భాగం. వీటి కొరతే(Chip Shortage India) ఇపుడు ప్రపంచాన్నంతటినీ వేధిస్తోంది. అందుకే కార్ల కోసం అడ్వాన్స్‌లు చెల్లించిన వారు, ఎప్పుడు డెలివరీ అవుతాయా? అని వేచిచూడాల్సిన పరిస్థితి. చిప్‌లు తగినంత సరఫరా కానందున, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదార్లు ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు. ఈ పరికరాలు అమర్చాల్సిన వాహనాలు, గృహోపకరణాల పరిశ్రమల్లోనూ ఉత్పత్తి ఆగిపోతోంది. చిప్‌ల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా 169 రకాల పరిశ్రమలపై ప్రభావం పడుతోందని అంచనా. ఈ సమస్య పరిష్కారం కోసం మనదేశం ప్రయత్నాలు చేస్తోంది. చిప్‌సెట్‌ల తయారీలో ఎంతో ముందున్న తైవాన్‌తో ఒప్పందం(India Taiwan Chip Deal) దిశగా పయనిస్తోంది.
తైవానే ఎందుకంటే..
5జీ ఫోన్ల నుంచి విద్యుత్ కార్ల వరకు.. అన్ని ఉత్పత్తులకు చిప్‌లను సరఫరా చేయడానికి 7.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55,000 కోట్లు) పెట్టుబడితో ప్లాంటును భారత్‌లో(India Taiwan Chip Deal) నిర్మింప చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్(టీఎస్‌ఎమ్‌సీ) ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్ తయారీ కంపెనీ. క్వాల్‌కామ్, యాపిల్ వంటివి దీనికి ఖాతాదార్లు. అందుకే తైవాన్‌తో మన ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇందుకు కావాల్సిన భూమి, నీరు, మానవ వనరుల అంశాల్లో పరిశీలన జరుపుతోంది. 2023 నుంచి 50 శాతం మూలధన వ్యయాలనూ ఇవ్వనుంది. ఈ విషయంలో తైవాన్ సైతం ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వేగమందుకోవాలని భావిస్తోంది. ఈ ఒప్పందం కింద సెమీ కండక్టర్ల తయారీలో ఉపయోగించే డజన్ల కొద్దీ ఉత్పత్తులపై సుంకాలనూ తగ్గించాలని భారత్ భావిస్తోంది.
సమస్య తీరిపోతుందా?
తైవాన్‌తో రాబోయే రోజుల్లో ఒప్పందంపై(India Taiwan Chip Deal) సంతకాలు జరిగినా.. సమస్య వెంటనే తీరిపోదు. ఎందుకంటే మొత్తం ప్రక్రియకు.. అంటే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభానికి ఏళ్లు పట్చొచ్చు. ప్రస్తుత కొరత వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు కొనసాగుతుందన్న అంచనాల మధ్య భారత్-తైవాన్ ప్రాజెక్టును మెరుపు వేగంతో చేపట్టినా.. 2023కు ముందు మాత్రం ఉత్పత్తి మొదలు కాకపోవచ్చు.