ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. 2020లో 7.3 శాతం వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది.
భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకం: ఏడీబీ
భారత్లో వినిమయం పెరిగినందున మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. తాజా నివేదికలో భారత్ ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొంది.
ఏడీబీ విడుదల చేసిన నివేదికలో ఆసియా దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రకటించింది. వడ్డీరేట్లు తగ్గడం, రైతులకు పెట్టుబడి ఊతం, దేశీయ డిమాండ్ ఊపందుకోవడం వల్ల భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఆసియా దేశాలూ 5 శాతం మేర వృద్ధి నమోదు చేస్తాయని ఏడీబీ అంచనా వేసింది.
దేశీయ వినిమయం పటిష్ఠంగా ఉండటం వల్ల ఎగుమతులు తగ్గినా, దాని ప్రభావం మిగతా ఆసియా దేశాలపై పెద్దగా ఉండబోదని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త యుసుకి సవద అభిప్రాయపడ్డారు.