Green buildings: లీడ్ (లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్) ధ్రువీకరించిన హరిత భవనాల్లో గత సంవత్సరానికి గాను (2021) భారత్‌కు మూడో స్థానం లభించింది. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ) రూపొందించిన జాబితా ప్రకారం.. తొలి రెండు స్థానాల్లో చైనా, కెనడా ఉన్నాయి. అమెరికాను ఈ జాబితాలో చేర్చనప్పటికీ.. లీడ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద విపణిగా ఆ దేశం కొనసాగుతోంది. ప్రపంచంలో హరిత భవనాల రేటింగ్‌కు లీడ్ ధ్రువీకరణను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 2021 డిసెంబరు 31 నాటికి లీడ్- ధ్రువీకరణ ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు. అమెరికా కాకుండా ఇతర దేశాలు, ప్రాంతాల్లో భవనాల నిర్మాణం, డిజైన్ విషయంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విషయాన్ని ఈ ర్యాంకులు ప్రతిబింబిస్తున్నాయని యూఎస్‌జీబీసీ వెల్లడించింది. 'భారత్ మొత్తంగా 146 భవనాలు, స్థలాలను లీడ్ ధ్రువీకరణకు ఇచ్చింది. వీటి మొత్తం స్థల విస్తీర్ణం సుమారు 2.8 మిలియన్ గ్రాస్ ఏరియా చదరపు మీటర్లు. భారత్‌లో 2020 నుంచి లీడ్ ధ్రువీకరించిన స్థల విస్తీర్ణం సుమారు 10 శాతం పెరుగుతోందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంద'ని పేర్కొంది. హరిత భవనాల సంఖ్యా పరంగా దిగ్గజ మూడు దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతూ వస్తోందని, లీడ్ ధ్రువీకరణకు గిరాకీ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని తెలిపింది.
- కోల్‌కతాలోని సీఈఎస్‌సీ హౌజ్‌కు అంతకుముందు లీడ్ గోల్డ్ రేటింగ్ ఉండేది. 2021లో దానిని గోల్డ్ ప్లాటినమ్‌కు మార్చారు.
- అంకిత్ జెమ్స్ డైమండ్ ఫ్యాక్టరీకి సూరత్‌లో ఉన్న వజ్రాల తయారీ కేంద్రానికి లీడ్ ప్లాటినమ్ ధ్రువీకరణ ఉంది.
- డీఎల్‌ఎఫ్‌కు చెందిన సైబర్ సిటీ ప్రాజెక్టు (గురుగ్రామ్)కు, అవెన్యూ మాల్(పుణె)కు కూడా లీడ్ ప్లాటినమ్ రేటింగ్ ఉంది.
- ప్రపంచంలో లీడ్ కర్బన రహిత ధ్రువీకరణ పొందిన మొదటి సంస్థ ఐటీసీ హోటల్స్. ఐటీసీ విండ్సర్ (బెంగళూరు), ఐటీసీ గ్రాండ్ చోళ (చెన్నై)కు ఈ ధ్రువీకరణలు లభించాయి.