India Oil Import bill: దేశంలో ముడి చమురు దిగుమతి బిల్లు విలువ డబుల్ అవ్వనుంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రెట్టింపు కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి ఈ బిల్లు 100 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు (10 నెలల్లోనే) 94.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తెలిపింది.
ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఒక్క జనవరిలోనే 11.6 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. గతేడాది ఇదే నెలలో చమురు దిగుమతులకు గానూ భారత్ కేవలం 7.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. ఫిబ్రవరిలో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటిన నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి ఏడాది మొత్తం బిల్లు 110-115 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పీపీఏసీ అంచనా వేస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 196.5 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌కు గానూ భారత్ 62.2 బిలియన్ డాలర్లను వెచ్చించింది. అంతకుముందు ఏడాది (2019-20) 227 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోగా.. అందుకు గానూ 101.4 బిలియన్ డాలర్లను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 175.9 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. దీంతో అటు పెట్రోల్ దిగుమతితో పాటు, చమురు ధరలు పెరగడంతో చెల్లించాల్సిన బిల్లు అమాంతం పెరుగుతోంది.