ఈ ఏడాదిలో దేశ జీడీపీ 12.5 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఇటీవల అంచనా వేసింది. అయితే 2020 కరోనా సమయంలో భారత జీడీపీ 8 శాతం క్షీణించిందని.. దాని నుంచి కోలుకోవాలంటే మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ ఐఎంఎఫ్ అధికారి పెట్యా కోవా బ్రూక్స్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న ఆమె.. కోలుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం ఉందని పేర్కొన్నారు.
"ఈ ఆర్థిక సంవత్సరానికి 12.5 వృద్ధిని అంచనా వేస్తున్నాము. పీఎంఐ డేటా, వాణిజ్యం సూచికలను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతోంది. ఈ కారణాలతో మొదటి త్రైమాసికంలో కూడా మెరుగైన వృద్ధి కనబరుస్తుందని నమ్ముతున్నాము. భారత్ ఇలా పుంజుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది."