విఫల విధానాలను అనుసరిస్తే భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్షీణిస్తుందని హెచ్చరించారు ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు. అమెరికన్ డాలర్ విలువ భారీగా పతనమైతే తప్ప భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. విభజన రాజకీయాలు, సైన్సును వెనక్కినెట్టే ధోరణులు, ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని ప్రతిఘటించడం వంటివి పెరగడం వల్ల భారత్ పట్ల ప్రపంచం అంతటా సందేహాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఆర్థిక నిర్ణయాలు వృత్తిపరంగా జరగాలన్నారు కౌశిక్.
కౌశిక్ బసు గతంలో ప్రపంచబ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా, సీనియర్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈనాడుతో ప్రత్యేక ముఖాముఖిలో పలు కీలక విషయాల గురించి వివరించారు కౌశిక్.
భారత స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ) వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం 4.2శాతమే. గత 11ఏళ్లలో ఇంత తక్కువ ఎన్నడూ లేదు. ఈ ఏడాది వృద్ధి బాగా క్షీణించి మైనస్ 3-5 శాతం నమోదు కావచ్చని అనేక సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అంతటా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం తీవ్రతను మీరు ఎలా అంచనా వేస్తున్నారు?
భారత్ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కొవిడ్ −19 ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక రంగంలో మందగమనం నెలకొంది. అయితే దీనివల్ల ఒక దేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ర్యాంకులలో వెనుకబడరాదు. ఇటీవలి కాలంలో ప్రపంచ స్థాయిలో వెలువడుతున్న అన్ని ర్యాకింగ్‌లలో మన స్థానం దిగజారుతోంది. మనం ఎదుర్కొంటున్న మందగమనంలో ఒక భాగం కొవిడ్−19 ప్రభావం వల్ల ఏర్పడింది . దీనిని అర్థం చేసుకోవచ్చు. మన దేశ సమస్యకు ఇతర కారణాలూ ఉన్నాయి. 'ఎకానమిస్ట్' మేగజైన్ కు చెందిన 'ఇంటెలిజెన్స్ యూనిట్' 43 ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ప్రతివారం ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న తొలి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ చాలా సంవత్సరాలు ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం 23వ స్థానానికి దిగజారింది. కరోనా ప్రభావానికి రెండేళ్ల ముందే భారత్‌లో తీవ్రమైన మందగమనం ప్రారంభమైంది. లాక్‌డౌన్ అమలు చేసిన విధానం వల్ల ఆర్థిక రంగాన్ని మరింతగా కుంగదీసే దెబ్బపడింది. లాక్‌డౌన్ అనంతరం భారత నిరుద్యోగ రేటు 20శాతానికి చేరింది. ప్రపంచంలోనే ఇది ఎక్కువ.
రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వంతో నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా ప్రస్తుత ప్రభుత్వం చక్కటి ఆర్థిక వృద్ధిని సాధించగలదని అంచనా వేశా. అయితే భారత్ గమనం నాకు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. భారత్‌కు ఉన్న ఆర్థిక మూలాలు, ఇక్కడి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో వేగంగా ఎదిగే ఆర్థిక శక్తిగా ఈ దేశం కాగలదు. అయితే మనం వ్యతిరేక దిశలో వెళుతున్నాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు స్వాతంత్ర్యం తర్వాత ఎన్నడూ లేనంత తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 1979లో వచ్చిన మైనస్ 5.2 శాతం వృద్ధి రేటే అత్యంత తక్కువ. ఈ సారి అంతకంటే తక్కువ వృద్ధి నమోదయ్యేలా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై మీ అభిప్రాయం ఏమిటి? అది ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఊతం ఇవ్వగలదా ?
అది నిజంగా పెద్ద ప్యాకేజీ. దాన్ని ప్రకటించడం నాకు సంతోషాన్ని కలిగించింది. సరిగ్గా అమలు చేస్తే దాని వల్ల చాలా మంచి జరుగుతుంది.
సంక్షోభ కాలంలో ఈ ప్యాకేజీ ద్వారా నిరుపేదలకు ప్రత్యక్షంగా తగిన ఆర్థిక సాయం అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?
ఇది సహేతుకమైన విమర్శే. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదలకు తక్షణం నేరుగా నగదు అందించాలి. దీన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి. దురదృష్టవశాత్తు ఇలాంటి చర్యను చేపట్టలేదు. అందుకే కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినప్పుడు ఒకవైపు సంతోషంతో పాటు, అది ప్రధానంగా ప్రకటనలకే పరిమితమై తదనంతర చర్యలు సరిగ్గా ఉండవేమోనన్న ఆందోళననూ కలిగింది. మనం ఆకట్టుకునే ప్రకటనలు చేస్తాం. తదుపరి చర్యలు మాత్రం అరకొరగానే ఉంటాయి. మన ఆర్థిక రంగం ఎదుర్కొనే సమస్యలలో ఇదీ ఒకటి.
ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుని ఉండాల్సిందని మీరు భావిస్తున్నారు? దీనిపై కరోనా ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందని అంచనా వేస్తున్నారు?
వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన వద్ద లాక్‌డౌన్‌ను సవ్యంగా అమలు చేయలేదు. అందువల్ల ఆర్థిక వ్యవస్థకు జరగాల్సిన దానికంటే ఎక్కువ నష్టమే సంభవించింది. మరోవైపు వైరస్ వ్యాప్తికీ ఇది దోహదపడింది. భారత్‌లో అమలు చేసిన లాక్‌డౌన్ ప్రపంచంలోనే తీవ్రమైనది. లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు సవ్యంగానే అనిపించింది. దానిని అమలు చేసే క్రమంలో చేపట్టాల్సిన సహాయ చర్యలపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉందనుకున్నా. ఉపాధి కోల్పోయే కార్మికులకు ఎలా ఆదుకోవాలి? సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ఏం చేయాలి? వంటివి ముందుగానే ఆలోచించాలి. ఆస్పత్రుల నిర్మాణం , వ్యాధి నిర్ధరణ పరీక్షల ఏర్పాట్లు అత్యంత వేగంగా జరగాలి. ఇలాంటివి చేయకపోతే లాక్‌డౌన్‌వల్ల ఫలితాలు చాలా తక్కువ. భారత్‌లో అదే జరిగింది. కార్మికులకు పని లేకుండా పోయి గుంపులుగా చేరారు. అలా ఇళ్లకు గుంపులుగానే నడక ప్రారంభించడం వల్ల వైరస్ కూడా ప్రబలింది. ఆసియా, ఆఫ్రికాలో ఎక్కడా.. ఇక్కడున్నంత తీవ్రంగా వైరస్ ప్రభావం లేదు.
వైరస్ కట్టడికి అత్యంత పేలవ ప్రయత్నం చేస్తున్న దేశాలలో భారత్ ఒకటి. లాక్‌డౌన్ సమయం నుంచీ వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిజానికి ఈ పరిస్థితి నివారించగలిగినది. కరోనా వ్యాప్తి ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది.
ఆర్థిక రంగ విషయానికి వస్తే భారత్ సరైన దిశను ఎంచుకోవాల్సిన కీలక దశలో ఉంది. మన దేశానికి ఐటీలో ఎంతో బలం ఉంది. ఉన్నత విద్య బాగుంది. పరిశోధన రంగమూ పటిష్ఠం అవుతోంది. ఇలాంటి బలాలు ఉన్నప్పటికీ మనం చేస్తున్న అనేక విధానపరమైన తప్పులవల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.
కరోనా కారణంగా ఆర్థిక రంగంపై, పౌరుల వ్యక్తిగత ప్రవర్తనపై ప్రభుత్వ నియంత్రణ మితిమీరుతోంది. ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది. ప్రతిదానికీ అనుమతులు తీసుకునే పరిస్థితి ఉండటం.. వాటిపై అధికారికంగా మితిమీరిన నియంత్రణ గతంలో మనకు అనుభవం. 'ఆ లైసెన్స్− పర్మిట్ రాజ్' వ్యవస్థ మనకు చెడు చేసింది. ప్రతిదానికీ అనుమతులు తీసుకునే పరిస్థితి.. వాటిపై రాజకీయంగా మితిమీరిన నియంత్రణ అంతకంటే ఎక్కువ హాని చేస్తాయి.