తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశాల్లో చమురు నిల్వకు భారత్ 'అన్వేషణ' - భారత చమురు నిల్వ సామర్థ్యం

అమెరికా సహా వాణిజ్యపరంగా లాభదాయకమైన దేశాల్లో ముడి చమురు నిల్వ చేసేందుకు అన్వేషణ చేస్తోంది భారత్​. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అత్యవసర సమయాల్లో చమురు కొరత రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

India Crude oil Storage Capacity
విదేశాల్లో చమురు నిల్వకు భారత్ ప్రయత్నాలు

By

Published : Sep 29, 2020, 8:52 PM IST

ప్రపంచంలోనే భారత్​ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో కొరత రాకుండా.. అమెరికా సహా ఇతర వాణిజ్య పరంగా లాభదాయకమైన దేశాల్లో చమురు నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రాంతాల అన్వేషణలోనే ఉన్నట్లు తెలిపారు పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

పశ్చిమాసియా దేశాల్లో అస్థిరతల వల్ల దిగుమతి లోటు ఏర్పడితే.. దాన్ని భర్తీ చేసేందుకు అమెరికా, రష్యా, అంగోళా దేశాలతో ధీర్ఘ కాలిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

'ఎనర్జీ టు వర్డ్స్ ఆత్మ నిర్భర్​ భారత్' పేరుతో నిర్వహించిన సదస్సులో ఈ విషయాలు వెల్లడించారు ధర్మేంద్ర ప్రధాన్. భారత్ ప్రస్తుతం 30కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని వివరించారు. ఇందులో ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలు ఉన్నట్లు తెలిపారు.

అత్యవసర సమయాల్లో చమురు నిల్వల సహకారంపై.. భారత్-అమెరికాలు జులై 17న ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు కూడా చేసినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి.

దేశీయ నిల్వ సామర్థ్యం ఎంతంటే?

ప్రస్తుతం దేశంలో 5.33 మిలియన్ టన్నుల (38 మిలియన్ బ్యారెల్​లు) ముడి చమురు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్​. తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో కలిపి మూడు చమురు నిల్వ కేంద్రాలున్నాయని వెల్లడించారు. ఈ నిల్వ దేశ అవసరాలకు దాదాపు 9.5 రోజులు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు.

అయితే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ).. సభ్య దేశాలన్నీ కనీసం 90 రోజుల అవసరాలకు తగ్గట్లు చమురు నిల్వలు ఉంచుకోవాలని సూచించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

నిల్వ సామర్థ్యం పెంపునకు కసరత్తు..

ఇందులో భాగంగా ఒడిశాలోని ఛండికోయ్​లో, కర్ణాటకలోని పాడూర్​లో మరో 6.5 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు ధరల్లో భారీ వ్యత్యాసం, సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా.. అమెరికాలో చమురు నిల్వ చేసే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం 85 శాతం దేశ చమురు అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు 101.1 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడింట రెండొంతులు పశ్చిమాసియా దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియా నుంచే వస్తోంది.

ఇదీ చూడండి:'పేద దేశాల కోసం 10 కోట్ల కరోనా టీకా డోసులు'

ABOUT THE AUTHOR

...view details