రాబోయే రెండు దశాబ్దాల్లో ఇంధన గిరాకీ భారత్‌లో పెరిగినట్లుగా ఇతర ఏ దేశంలోనూ పెరగకపోవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించింది. 2030 కల్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా భారత్ అవతరిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇంధన వినియోగంలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. చైనా, అమెరికా, ఐరోపా కూటమిలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఐరోపా కూటమిని వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఐఈఏ తెలిపింది.
మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా భారత్! - ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ
భారత్‌లో ఇంధన గిరాకీ తారస్థాయికి చేరుకునే ఆవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్.. మరో రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారునిగా అవతరిస్తుందని అంచనా వేసింది. 2000 నుంచి ఇంధన వినియోగం రెట్టింపు అయ్యిందని పేర్కొంది.
2030 కల్లా మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా భారత్
ఇప్పటికీ బొగ్గూ, చమురే
- 2000 నుంచి ఇంధన వినియోగం రెట్టింపు అయ్యిందని, ఇందులో చాలా వరకు ఇంధన అవసరాలను బొగ్గు, చమురు తీరుస్తున్నాయని పేర్కొంది. 2030 కల్లా ఇది మరో 35 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఐఏఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బైరల్ తెలిపారు. 2019-40 మధ్య ప్రపంచ ఇంధన గిరాకీ వృద్ధిలో భారత్‌దే పావు వంతు వాటా ఉంటుందని తెలిపింది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన వృద్ధిలో చైనాది మొదటి స్థానం కాగా.. భారత్‌ది రెండో స్థానమని తెలిపింది. ఈ నివేదికలో ఐఈఏ పేర్కొన్న మరికొన్ని వివరాలు ఇలా..
- 2040 కల్లా భారత్ విద్యుత్ వ్యవస్థ ఐరోపా కూటమి కంటే పెద్దదిగా అవతరిస్తుంది. విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానాన్ని చేరుకుంటుంది. అమెరికా కంటే 30 శాతం అధికంగా పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- సొంత కారు ఉండే వారి సంఖ్య ఐదు రెట్లు పెరుగుతుండటంతో.. ప్రపంచంలోనే చమురు గిరాకీపరంగా భారత్ అగ్రస్థానంలో ఉంటుంది.
- భారత్‌లో సహజవాయువు డిమాండు 2040 కల్లా మూడు రెట్లకు పైగా పెరుగుతుంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సహజవాయువు విపణిగా కూడా భారత్ నిలుస్తుంది.
- భారత్‌లో నిరంతరాయంగా పారిశ్రామికీకరణ విస్తరిస్తుండటంతో ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. ఇండస్ట్రియల్ వ్యాల్యూయాడెడ్‌కు సంబంధించి ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 10 శాతానికి చేరింది. 2040 కల్లా ఈ వాటాను 20 శాతానికి పెంచుకుంటుంది. ప్రపంచ పారిశ్రామిక ఇంధన గిరాకీ వృద్ధిలోనూ మూడింట ఒక వంతు వాటా భారత్‌దే ఉండనుంది.
- 2040 కల్లా భారత్‌లో చమురు గిరాకీ 74 శాతం మేర పెరిగి రోజుకు 8.7 మిలియన్ బ్యారెళ్లకు చేరొచ్చు. సహజవాయువు అవసరాలు కూడా మూడింతలై 201 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరొచ్చు. బొగ్గు గిరాకీ ప్రస్తుతమున్న 590 మిలియన్ టన్నుల నుంచి 772 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారత్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి రావొచ్చని పేర్కొంది.
- 2040 కల్లా భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటం 90 శాతానికి పైగా పెరగొచ్చని.. ప్రస్తుతం ఇది 75 శాతంగా ఉంది. దేశీయంగా ఉత్పత్తి కంటే వినియోగం పెరుగుతుండటమే ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. సహజవాయువు అవసరాల్లో దేశ దిగుమతులు 2010లో 20 శాతంగా ఉండగా.. 2019లో 50 శాతానికి చేరింది. 2040 నాటికి ఇది మరింతగా పెరిగి 60 శాతానికి చేరే అవకాశం ఉంది.
- 'ఆర్థిక వ్యవస్థ, జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ విస్తరణతో ప్రపంచ సగటుకు మూడు రెట్ల మేర భారత ఇంధన అవసరాలు పెరుగుతాయ'ని ఇండియా ఎనర్జీ అవుట్‌లుక్- 2021లో ఐఈఏ పేర్కొంది.
- పట్టణ జనాభాలో వృద్ధితో ముంబయి లాంటి నగరాలు మరో 13 తయారవుతాయని.. ఈ పరిణామం సిమెంటు, ఉక్కు, విద్యుత్‌కు గిరాకీ పెరిగేందుకు తోడ్పడతాయి.
- మున్ముందు ఇంధన వినియోగ అవసరాలు తీర్చేందుకు సౌరవిద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం గణనీయంగా పెరిగేలా విధానరూపకర్తలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
- 2040 కల్లా జీడీపీ పరిమాణం 8.6 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉండటంతో.. ఇంధన వినియోగం రెట్టింపై 1,123 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని ఐఈఏ లెక్కగట్టింది.
ఇదీ చూడండి:'ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలం'