కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ.కామ్ తెలిపింది. రిటైల్ పరిశ్రమలు, రవాణా, విమానయానం, సేవల రంగాల్లో నియామక కార్యకలాపాలు మార్చిలో నెమ్మదించినట్లు వెల్లడించింది.
మానవ వనరుల నియామకాలకు సంబంధించి రిటైల్ రంగంలో 50 శాతం తగ్గుదల నమోదైందని నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ మార్చి 2020 నివేదిక స్పష్టం చేసింది. తర్వాతి స్థానాల్లో 38 శాతంతో వాహనరంగం ఉండగా.. ఫార్మా 26 శాతం, బీమా 11 శాతం, ఫినాన్స్ 10 శాతం, ఐటీ-సాఫ్ట్ వేర్ 9 శాతం, బీఎఫ్ఎస్ఐ 9 శాతం తగ్గుదల నమోదు చేశాయి.
మార్చిలో మొదటి 20 రోజుల్లో 5 శాతం మాత్రమే క్షీణించినట్లు నౌక్రీ.కామ్ ప్రధాన వ్యాపార అధికారి(సీబీఓ) పవన్ గోయల్ తెలిపారు.
"దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వ్యవస్థాగతంగా నియామకాల్లో తగ్గుదల నమోదైంది. దాదాపు ఇదంతా చివరి 10 రోజుల్లోనే క్షీణత నమోదైంది. మొత్తంగా ఉద్యోగ నియామక కార్యకలాపాలు 18 శాతం తగ్గాయి. "
- పవన్ గోయల్, నౌక్రీ.కామ్ సీబీఓ