India Export Growth: దేశ ఎగుమతులు జనవరిలో 25.28 శాతం పెరిగి 34.50 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంజినీరింగ్, పెట్రోలియమ్, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు పెరగడం ఇందుకు దోహదం చేసింది. దిగుమతులు కూడా 23.54 శాతం అధికమై 51.93 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 17.43 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021 జనవరిలో వాణిజ్యలోటు 14.499 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మంగళవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల వివరాలు ఇలా..
- 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు ఎగుమతులు 46.73 శాతం పెరిగి 335.88 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఇదే కాలంలో ఎగుమతులు 228.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- దిగుమతులు కూడా ఏప్రిల్-జనవరిలో 62.65 శాతం వృద్ధి చెంది 495.75 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్యలోటు 75.87 బిలియన్ డాలర్ల నుంచి పెరిగి 159.87 బిలియన్ డాలర్లకు చేరింది.
- జనవరిలో పసిడి దిగుమతులు 40.52 శాతం తగ్గి 2.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
- ముడి చమురు దిగుమతులు 26.9 శాతం అధికమై 11.96 బిలియన్ డాలర్లకు చేరాయి.
- జనవరిలో ఇంజినీరింగ్, పెట్రోలియమ్, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు వరుసగా 24.11%, 95.23%, 13.64 శాతం పెరిగి9.2 బిలియన్ డాలర్లు, 4.17 బిలియన్ డాలర్లు, 3.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- ఔషధ ఎగుమతులు 1.15 శాతం తగ్గి 2.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.