ఏప్రిల్ నెలలో స్థూల ఆర్థిక గణాంకాలు రాణిస్తున్నాయన్నది నిజమే కానీ.. అది గతేడాది ఉన్న తక్కువ ప్రాతిపాదిక (లో బేస్ ఎఫెక్ట్) కారణంగా అని గుర్తుంచుకోవాలని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. అదే సమయంలో కరోనా మలి విడత కారణంగా వినియోగదారు సెంటిమెంటు దెబ్బతిందని దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఆ సంస్థ ఇంకా ఏమంటోందంటే..
- తక్కువ ప్రాతిపదిక ఉన్నా ఏప్రిల్‌లో చాలా వరకు రంగాల్లో పెద్దగా వృద్ధి కనిపించలేదు. కరోనా అతిపెద్ద సమస్యగా మారడమే ఇందుకు నేపథ్యం.
- వినియోగదారు సెంటిమెంటు బాగా క్షీణించడం, అధిక ఆరోగ్య సంరక్షణ, ఇంధన బిల్లుల కారణంగా సమీప భవిష్యత్‌లో కొనుగోళ్లు పరిమితంగానే ఉండొచ్చు. అంతే కాదు కాంట్రాక్టు ఆధారిత సేవలపై వ్యయాలనూ కోత విధించవచ్చు. ఇదంతా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
- గతేడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అన్నీ డీలా పడ్డాయి. అందుకే ఈ ఏప్రిల్‌లో కొన్ని రంగాల్లో భారీ వృద్ధి కనిపించింది. అయితే ఏప్రిల్‌లో 13 ఆర్థికేతర సూచీల్లో ఎనిమిది కరోనా ముందు స్థాయిల కంటే దిగువనే ఉన్నాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అంటున్నారు.
- జీఎస్‌టీ ఇ-వే బిల్లులు, విద్యుదుత్పత్తి, వాహన రిజిస్ట్రేషన్లు, రైలు రవాణా రద్దీ వంటివి మందగమనం పాలయ్యాయి. ఏప్రిల్‌లో అంతక్రితం నెలతో పోలిస్తే డీలా పడ్డాయి. కేసుల వ్యాప్తి, స్థానిక లాక్‌డౌన్‌లు ఇందుకు కారణమయ్యాయి. ఈ ధోరణి మే నెలలోనూ కొనసాగనుందని ప్రాథమిక డేటా చెబుతున్నట్లు వివరించారు.
- బ్యాంకు డిపాజిట్లు తప్ప మొత్తం 15 హై ఫ్రీక్వెన్సీ సంకేతాల్లో 14 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మెరుగయ్యాయి. అందులో వాహన రిజిస్ట్రేషన్లు, వాహన ఉత్పత్తి, జీఎస్‌టీ ఇ-వే బిల్లులు ఉన్నాయి.
- మొత్తం మీద మన్నికైన వినియోగదారు వస్తువులపై వ్యయాలు పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.