భారత్‌లో నాయకత్వలేమి, ముందు చూపు కొరత, తొందరగా సంతృప్తి పడే లక్షణాలకు పెరిగిపోతున్న కొవిడ్ కేసులే ఉదాహరణగా నిలిచాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఒక వేళ మనం అప్రమత్తంగా ఉంటే.. జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదని గ్రహించాలి. ప్రపంచంలో మిగిలిన చోట్ల ఏం జరిగిందా అని ఎవరైనా దృష్టి పెడితే తెలిసేది. బ్రెజిల్‌నే ఉదాహరణకు తీసుకొంటే.. అక్కడ వైరస్ రెట్టింపు వ్యాప్తి శక్తితో వెనక్కువచ్చిందని గుర్తించేవాళ్లం. గతంలో మనం వైరస్‌ను జయించామని భావించాము. వైరస్ తట్టుకొనే శక్తి వచ్చిందని భ్రమించి మళ్లీ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తెరిచాము. ఆ రకంగా భ్రమించడమే ఇప్పుడు ముప్పుగా మారింది' అని వ్యాఖ్యానించారు. తొలి తరంగాన్ని జయించినప్పుడు తగినంత సమయం లభించిందని ఎవరూ భావించకపోవడం టీకాలను అందుబాటులోకి తెచ్చే అంశం కూడా ఆలస్యమైందని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.