లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎల్‌ఐసీ)(Life Insurance Corporation) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)(Foreign direct investment) అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, సంస్థ తొలి పబ్లిక్ ఆఫర్‌లో(ఐపీఓ) విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐ(FDI in Lic) అనుమతికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల విభాగం, పెట్టుబడులు- ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) మధ్య.. కొన్ని వారాలుగా చర్చ నడుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో అంతర్‌మంత్రిత్వ శాఖల మధ్య కూడా చర్చ జరుగుతుందని, అనంతరం మంత్రివర్గ ఆమోదం అవసరం అవుతుందని వివరించాయి.
ప్రాథమిక దశలో చర్చలు..
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఎల్‌ఐసీలో ఎక్కువ వాటాను ఒకటే విదేశీ పెట్టుబడి సంస్థ కొనుగోలు చేసేలా వీలు కల్పించాలన్నది ప్రతిపాదన. అయితే వ్యూహత్మక పెట్టుబడికి పరిమితి అనేది ఉంటుంది. మరి ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐకి సంబంధించి ఎంత మేర పరిమితిని ప్రభుత్వం విధిస్తుందనేది ఇప్పటివరకైతే స్పష్టత లేదని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డీఐ అనుమతించాలని భావిస్తున్నారని సమాచారం. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐని(FDI in Lic) అనుమతినిచ్చే అంశంపై చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.