తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరోగ్య బీమా.. ఎలా ఉండాలంటే.. - ఆర్థిక ప్రణాళికలు

ప్రస్తుత కొవిడ్‌-19 సంక్షోభంలో ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలంటే.. ఆరోగ్య బీమా పాలసీలు ఉండాల్సిందే. ఎప్పుడు ఏ అత్యవసరం వస్తుందో అని సిద్ధంగా ఉండాల్సిన రోజులివి. ప్రతి ఒక్కరూ తమతోపాటు, తమ కుటుంబానికీ సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాలి.

health insurance
ఆరోగ్య బీమా

By

Published : May 28, 2021, 12:27 PM IST

కష్టాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయంటారు. కొంతకాలంగా మనం ఎదుర్కొంటున్న పెద్ద కష్టం ఇప్పటికే మనకు ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఆర్థికంగా భరోసా ఉండటం, ఆరోగ్య సంరక్షణ ఎంత అవసరం అనేది తెలుసుకున్నాం. ప్రస్తుత కొవిడ్‌-19 సంక్షోభంలో ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలంటే.. ఆరోగ్య బీమా పాలసీలు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో వీటిని తీసుకునే వారి సంఖ్యా బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో ఎవరికి ఏ పాలసీ నప్పుతుంది.. దానిని ఎలా ఎంచుకోవాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనారోగ్యం ఒకవైపు ఆసుపత్రి బిల్లుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి మరోవైపు.. ఇప్పుడు చాలా కుటుంబాలు ఇలాంటి విషమ పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడు ఏ అత్యవసరం వస్తుందో అని సిద్ధంగా ఉండాల్సిన రోజులివి. ప్రతి ఒక్కరూ తమతోపాటు, తమ కుటుంబానికీ సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాలి.

కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు..

యువకులుగా ఉన్నప్పుడు బీమా పాలసీ తీసుకోవడం ఎంతో సులభం. 25-35 ఏళ్ల మధ్యలో ఉన్న వారు.. పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చూడాలంటే..

వేచి ఉండే సమయం:

సాధారణంగా ఈ వయసులో ఉన్న వారికి ముందస్తు వ్యాధులు ఉండే అవకాశం చాలా తక్కువ. కాబట్టి, పాలసీలో వేచి ఉండే సమయం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పాలసీ తీసుకునే ముందే బీపీ, మధుమేహం లాంటివి ఉన్నా.. వాటికి వర్తించే వ్యవధి తక్కువగా ఉండాలి.

విలువకు తగ్గట్టుగా:

ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆర్థిక ప్రణాళికను ప్రారంభించి, మంచి రాబడి వచ్చేలా మదుపు చేయాల్సి ఉంటుంది. ఇదే సూత్రం ఆరోగ్య బీమాకూ వర్తిస్తుంది. మీరు చెల్లించే ప్రీమియానికి తగిన విలువను ఇచ్చే పాలసీలవైపే మొగ్గు చూపండి.

దేశవ్యాప్తంగా..

ఇప్పుడు యువత ఎప్పటికప్పుడు ఉద్యోగాలు, ప్రాంతాలు మారుతున్నారు. కాబట్టి, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా.. మీ పాలసీ రక్షణ కల్పించేలా ఉండాలి. అందుకే, పాలసీని ఎంచుకునేటప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వివరాలు కచ్చితంగా చూసుకోండి.

సేవలు ఎలా ఉన్నాయి:

బీమా సంస్థ పాలసీ అందించడం మొదలు.. క్లెయింల పరిష్కారం వరకూ మీకు ఎంత వేగంగా సేవలను అందించగలదు అనేది ముందుగానే పరిశీలించండి. అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. క్లెయిం చెల్లింపులు సరిగా ఉన్నాయా లేదా చూడండి. చెల్లింపుల చరిత్ర సరిగ్గా ఉన్న బీమా సంస్థ నుంచే పాలసీని తీసుకున్నప్పుడే మీరు భరోసాగా ఉండగలరు.

35-55 ఏళ్ల మధ్యలో..

వయసు పెరుగుతున్న కొద్దీ.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. వేచి ఉండే సమయం, ముందస్తు వ్యాధులు, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు, క్లెయింల పరిష్కారంలాంటి అంశాలతో పాటు ఈ వయసులో ఉన్నవారు పరిశీలించాల్సిన అదనపు అంశాలు కొన్ని ఉన్నాయి..

ఎక్కువ మొత్తంలో:

ఉద్యోగంలో చేరిన కొత్తలో.. లేదా చిన్న వయసులో ఉన్నప్పుడు తీసుకున్న పాలసీలు ఇప్పుడు పూర్తి స్థాయి రక్షణ ఇవ్వలేకపోవచ్చు. 40-50 ఏళ్ల వయసులో బాధ్యతలు ఉంటాయి. ఆసుపత్రి ఖర్చులూ దీనికి కలిస్తే.. ఇబ్బందులు తప్పవు. ఈ వయసులో ఉన్నవారు కనీసం రూ.5లక్షలకు తక్కువ కాకుండా పాలసీని తీసుకోవడం తప్పనిసరి.

కుటుంబం అంతటికీ..

ఈ వయసులో ఉన్న వారు.. తప్పనిసరిగా తమ కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోవాలి. జీవిత భాగస్వామి, పిల్లలు, తమ మీద ఆధారపడిన తల్లిదండ్రులకూ పాలసీ రక్షణ ఉండాలి. వ్యక్తిగతంగానూ అదనపు పాలసీ ఉండటం మంచిదే

పదవీ విరమణకు దగ్గరలో..

పదవీ విరమణ ప్రణాళికలో ఆరోగ్య బీమాకూ ప్రాధాన్యం ఇవ్వాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత బీమా పాలసీలో కేవలం ఆసుపత్రి చికిత్సకే కాకుండా.. ఆరోగ్య సంరక్షణకూ ప్రాధాన్యం కల్పించేలా ఉండాలి. మధుమేహం, బీపీలాంటి వ్యాధులకూ పాలసీలో పరిహారం కల్పించాలి.

ఇంటి వద్ద చికిత్స:

ఆసుపత్రిలో చేరడంతోపాటు.. ఇంటివద్ద చికిత్స తీసుకునే సందర్భంలోనూ పరిహారం ఇచ్చేలా పాలసీని ఎంపిక చేసుకోవాలి. డే కేర్‌ చికిత్సలకూ పరిహారం అందించేలా పాలసీ ఉండాలి.

టెలీ మెడిసిన్‌కూ..

ప్రస్తుత మహమ్మారి రోజుల్లో టెలీ మెడిసిన్‌కు ప్రాధాన్యం పెరిగింది. మీరు ఎంచుకునే పాలసీలో ఈ ఖర్చులనూ చెల్లించే వీలుండాలి. ముఖ్యంగా పెద్దలకు దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మర్చిపోకూడదు. చికిత్స కోసం వెళ్లి, ఎదురుచూడటంలాంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం క్షేమం కాదన్నది తెలిసిందే. ఇంటి నుంచి కదలకుండానే చికిత్స తీసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఈ టెలీ మెడిసిన్‌ తోడ్పడుతుంది

తీవ్ర వ్యాధులకూ..

అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు ఆరోగ్య బీమా పాలసీలు పరిహారం ఇస్తాయి. కానీ, కొన్నిసార్లు తీవ్ర వ్యాధుల బారిన పడే ఆస్కారమూ ఉంది. ఇలాంటప్పుడు పరిహారం కోసం క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను ఎంచుకోవడం ఎంతో అవసరం. కేన్సర్‌, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధుల్లాంటి బారిన పడినప్పుడు చికిత్స ఖర్చుతో నిమిత్తం లేకుండా ఈ పాలసీలు పరిహారం అందిస్తాయి.

- డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలీడ్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చదవండి:చైనాకు మిత్ర దేశాలు లేవు: అమెరికా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details