కరెంట్ ఖాతా లోటుపై (సీఏడీ) ప్రభావం చూపించే పసిడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,80,000 కోట్లు) చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఇదే సమయంలో పసిడి దిగుమతులు 680 కోట్ల డాలర్లు (సుమారు రూ.51,000 కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ఈ సెప్టెంబరులోనే 511 కోట్ల డాలర్ల (సుమారు రూ.38,325 కోట్లు) పసిడి దిగుమతి అయ్యింది. 2020 సెప్టెంబరులో 60.14 కోట్ల డాలర్ల (రూ.4510 కోట్ల) పసిడి మాత్రమే వచ్చింది. పసిడి దిగుమతుల్లో భారత్ వాటా అత్యధికంగా ఉంటుంది. ఆభరణాల పరిశ్రమ గిరాకీకి తగ్గట్లు ఈ దిగుమతులు ఉంటుంటాయి. వార్షికంగా సుమారు 800-900 టన్నుల పసిడిని మనదేశం దిగుమతి చేసుకుంటోంది.
- వెండి దిగుమతులు మాత్రం 2021-22 ఏప్రిల్-సెప్టెంబరులో 15.5 శాతం మేర తగ్గి, 61.93 కోట్ల డాలర్ల (సుమారు రూ.4645 కోట్ల)కు పరిమితమయ్యాయి. అయితే ఒక్క సెప్టెంబరులోనే వెండి దిగుమతులు 55.23 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. గత ఏడాది సెప్టెంబరులో ఇవి 92.3 లక్షల డాలర్లుగా నమోదయ్యాయి.
- పసిడి దిగుమతులు భారీగా పెరగడం వల్ల దేశ వాణిజ్య లోటు గత సెప్టెంబరులో 2,260 కోట్ల డాలర్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే నెలలో వాణిజ్య లోటు 296 కోట్ల డాలర్లు మాత్రమే.
- వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరులో 1,930 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఏడాది క్రితం ఇదే సమయం ఎగుమతులు 870 కోట్ల డాలర్లు మాత్రమే.
- పండుగల సీజన్ కావడం వల్ల పసిడికి గిరాకీ లభిస్తుందనే అంచనాతో అధికంగా దిగుమతి అయ్యిందని భారత వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఛైర్మన్ కొలిన్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.
సెప్టెంబరులో పసిడి ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్లు