భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రస్తుతం భారత్ తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక తిరోగమనానికి పరిష్కారంగా ప్రభుత్వం సత్వరమే విధానపర నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సోమవారం విడుదల చేసిన తన నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థపై పలు విషయాలు ప్రస్తావించింది. ఇటీవలే కాలంలో భారతదేశంలో గణనీయమైన ఆర్థిక వృద్ధి కారణంగా లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డ విషయాన్ని గుర్తుచేసింది. అయితే 2019 ప్రథమార్థంలో పలు కారణాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించిందని స్పష్టం చేసింది.
"ఆర్థిక వృద్ధి మందగించడమే ప్రస్తుతం భారత్కు సమస్య. ఆర్థిక రంగంలో నెలకొన్న సమస్యల వల్ల ఇంతకుముందు అంచనా వేసినట్లు వెంటనే కోలుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం భారత్ తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉంది."
-రనిల్ సాల్గడో, ఇండియా మిషన్ చీఫ్, ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి కేవలం 4.5 శాతానికి పరిమితమైంది. ఇది గత ఆరు సంవత్సరాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. బలహీన ఆర్థిక కార్యకలాపాలు డిసెంబర్లో సైతం కొనసాగే అవకాశం ఉందని పలు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.