భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 'కొవాగ్జిన్' టీకాను తన యూనిట్లో తయారు చేసి అందించడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం హైదరాబాద్ కరకపట్లలోని ఐఐఎల్ వ్యాక్సిన్ ప్లాంటును సిద్ధం చేస్తున్నారు. ఈ ప్లాంటులో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారని, ఈ కసరత్తు అంతా నెలన్నర వ్యవధిలో పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే కొవాగ్జిన్ టీకా మందు తయారీ మొదలవుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ప్లాంటులో ప్రస్తుతం రేబిస్ టీకా తయారవుతోంది.
కొవిడ్ కొత్త కేసులు రోజూ 3 లక్షలకు పైగా నమోదవుతున్నందున, 'కొవాగ్జిన్' టీకా అవసరాలు బాగా పెరిగాయి. ఈ టీకా తయారీ పెంచేందుకు సహకరించడానికి ఐఐఎల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 'కొవాగ్జిన్' టీకా మందును భారత్ బయోటెక్ ప్రమాణాల ప్రకారం ఐఐఎల్ తయారు చేసి, ఆ మందును తిరిగి భారత్ బయోటెక్‌కు ఇస్తుంది. ఆ మందుతో భారత్ బయోటెక్ టీకా తయారీని పూర్తి చేసి (ఫిల్ అండ్ ఫినిష్ ప్రక్రియ), ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది.