దేశంలో లాక్ డౌన్ దృష్ట్యా రుణాల నెలవారీ సులభ వాయిదాలు (ఈఎంఐ), వడ్డీ బకాయిలపై 3 నెలల మారటోరియం విధించింది ఆర్బీఐ. ఈ సౌలభ్యం రుణగ్రహీతలకు తాత్కాలిక లాభం చేకూర్చినా.. దీర్ఘకాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది.
ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలో వివిధ బ్యాంకులు మారటోరియం పథకాలను ప్రకటించాయి. వీటిని పరిశీలిస్తే మారటోరియం కాలానికి వడ్డీ కట్టాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
రెండు వైపులా కష్టాలే..
ఈ పరిస్థితులను చూస్తుంటే రుణగ్రహీతలకు ఒకేసారి రెండు కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా కారణంగా ఆదాయాలు దెబ్బతినగా.. మారటోరియాన్ని ఎంచుకుంటే ఈఎంఐ కాలవ్యవధి పెరిగి వడ్డీ ఎక్కువవుతుంది.
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఈ విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా చెప్పింది. మారటోరియం ఎంచుకున్న వారికి 3 నెలల కాలంలోనూ తీసుకున్న అసలుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ఈ వడ్డీ మొత్తాన్ని అదనపు ఈఎంఐల ద్వారా రుణదాతలకు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయం అర్థమయ్యేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.
- మీరు రూ.30 లక్షలు గృహ రుణంగా తీసుకున్నారు. ఇంకా 15 ఏళ్లు ఈఎంఐలు కట్టాల్సి ఉంది. అప్పుడు మీకు అదనంగా పడే వడ్డీ రూ.2.34 లక్షలు. అంటే 8 ఈఎంఐలతో సమానం.
- మీ వాహనంపై తీసుకున్న లోను రూ.6 లక్షలు. ఇంకా 54 నెలల ఈఎంఐ మిగిలి ఉంది. అప్పుడు మీపై పడే అదనపు వడ్డీ రూ.19 వేలు. ఇది ఒకటిన్నర ఈఎంఐకి సమానం.
- మీరు రూ.లక్ష వ్యక్తిగత రుణం కింద తీసుకున్నారు. వడ్డీ రేటు 12 శాతం. అంటే నెలకు రూ.1000 వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ 3 నెలలు మీరు కట్టకపోయినట్లయితే మీపై రూ.3,030.10 అదనపు భారం పడుతుంది.
ఏది ఉత్తమం..
ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేయాలనుకునేవారు జాతీయ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్)ను సంప్రదించాలని ఎస్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ మెయిల్ ఐడీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకు సంబంధించిన మెయిళ్ల జాబితాను ఎస్బీఐ విడుదల చేసింది.
ఈఎంఐ వాయిదా వద్దనుకున్నవాళ్లు యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాలపై ప్రభావం లేని వారు వాయిదాలను సమయానికి చెల్లించాలని భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) స్పష్టం చేసింది.