తెలంగాణ

telangana

ETV Bharat / business

రుణ రేటింగ్‌ తగ్గితే.. మనకేంటి నష్టం? - Indian sovereign rating

భారత ప్రభుత్వ సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ తగ్గించింది. రెండు దశాబ్దాలలో ఇలా జరగడం ఇప్పుడే. మనదేశ ఆర్థిక మూలాలు బలంగా లేవా?.. కరోనా కారణంగా బలహీనమయ్యాయా? తాజా రేటింగ్‌ వల్ల భారత్‌కు, కంపెనీలకు నష్టమా? తెలుసుకుందాం.

Moody's downgrades Indian sovereign rating
భారత సౌర్వభౌమ రేటింగ్​ను తగ్గించిన మూడీస్

By

Published : Jun 3, 2020, 6:46 AM IST

ప్రపంచంలోని మూడు దిగ్గజ రేటింగ్‌ సంస్థల్లో ఒకటైన మూడీస్‌, భారత సార్వభౌమ రుణ రేటింగ్‌ను బీఏఏ2 నుంచి బీఏఏ3కి తగ్గించింది. భవిష్యత్‌ అంచనాలపైన ప్రతికూల ధోరణిని కూడా ప్రదర్శించింది. బీఏఏ3 అనేది అత్యంత తక్కువ రేటింగ్‌. దీని తర్వాత రేటింగ్‌ చెత్తే (జంక్‌).

2017 నుంచీ ఆర్థిక సంస్కరణల అమలు బలహీనంగా ఉండడం; కొంత కాలంగా ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉండటం; అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో ద్రవ్య పరిస్థితి బాగా క్షీణించడం; భారత ఆర్థిక రంగంలో ఒత్తిడి పెరగడం.. ఇవీ.. రేటింగ్‌ తగ్గించడానికి మూడీస్‌ చెప్పిన కారణాలు. అందులోనూ రేటింగ్‌తో పాటు 'ప్రతికూల ధోరణి'ని ప్రదర్శించింది. అంటే భారత్‌ రేటింగ్‌ మరింత తగ్గవచ్చన్న సంకేతాలన్నమాట. కరోనా సమయంలో ఈ రేటింగ్‌ తగ్గింపు వచ్చింది మినహా, కరోనా ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల కాదని కూడా ఆ సంస్థ తేల్చింది.

రెండేళ్ల కిందట బాగు

నవంబరు 2017లో ఇదే మూడీస్‌ భారత రేటింగ్‌ను 'స్థిర' భవిష్యత్‌ అంచనాతో 'బీఏఏ2'కు మెరుగుపరచింది. ఆ సమయంలో.. కీలక సంస్కరణలను సమర్థంగా అమలు చేస్తే సార్వభౌమ రుణ రేటింగ్‌ బలోపేతమవుతుందని పేర్కొంది. అలా జరగలేదు. అప్పటి నుంచీ సంస్కరణల్లో అమలు బలహీనంగానే కనిపించిదని మూడీస్‌ చెబుతోంది. విధానాల అమలు సామర్థ్యం తగ్గడం వల్ల వృద్ధి కూడా డీలా పడింది. 2019-20లో 4.2 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది 11 ఏళ్ల కనిష్ఠ స్థాయి.

మరి.. ప్రభావం ఏమిటి?

ఏటా భారత్‌ ద్రవ్యలోటు లక్ష్యం చేరడంలో విఫలమవుతూ వచ్చింది. దీనితో అప్పులు కూడా స్థిరంగా పెరుగుతూనే వచ్చాయి. 2018-19 జీడీపీలో భారత రుణ భారం 72 శాతంగా ఉంది. 2020లో ఇది 84 శాతానికి చేరుతుందన్న అంచనాలున్నాయి. రేటింగ్‌ అనేది భారత ఆర్థిక తీరుపై ఆధారపడి ఉంటుంది. అది తగ్గిందంటే భారత ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు అంతక్రితంతో పోలిస్తే 'మరింత నష్టభయం' ఉన్నట్లు లెక్క. ఎందుకంటే.. ఆర్థిక వృద్ధి బలహీనపడడానికి తోడు ద్రవ్య పరంగా అధ్వాన పరిస్థితికి వెళుతున్నపుడు, ప్రభుత్వానికి తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌ కానీ.. భారత్‌లోని కంపెనీలు కానీ విదేశాల్లో జారీ చేసే బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. అంటే ప్రభుత్వం కానీ.. కంపెనీలు కానీ బయటి నిధులను సమీకరించడం సంక్లిష్టమవుతుంది.

మన విదేశీ రుణాలు తక్కువే: ఎస్‌బీఐ

భారత్‌పై రేటింగ్‌ ప్రభావం ఇప్పుడే ఏమీ ఉండదని ఎస్‌బీఐ నివేదిక అంటోంది. మన విదేశీ రుణాలపై ప్రభావం పడినా, తట్టుకునేందుకు సరిపడా మారకపు నిల్వలు ఉన్నాయని చెబుతోంది. 'మొత్తం మన సార్వభౌమ రుణాల్లో విదేశీ రుణాలు 20 శాతమే. ప్రస్తుతం మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు ఆ రుణ అవసరాలకు సరిపోతాయ'ని ఎస్‌బీఐ తన పరిశోధన నివేదిక 'ఈకోరాప్'లో మంగళవారం పేర్కొంది. ఎక్స్ఛేంజీ రేట్లలో కానీ, బాండ్లపై కానీ తక్షణం ఈ రేటింగ్‌ ప్రభావం ఉండదనీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'కరోనాతో సంక్షోభంలో పర్సనల్ లోన్స్​కే మొగ్గు'

ABOUT THE AUTHOR

...view details