చైనా వస్తువులను నిషేధిస్తే మొట్టమొదట దెబ్బ టెలికాం రంగంపైనే పడనుంది. ఇప్పటికే ఈ రంగంలో 20 ఏళ్ల కాలానికిగానూ దాదాపు 2 బిలియన్ డాలర్లు వెచ్చించింది చైనాకు చెందిన హువావే సంస్థ. 6వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు చైనా ఉత్పత్తులపై నిషేధం అంటే కచ్చితంగా ఈ సంస్థ ఉనికి ప్రమాదంలో పడనుంది. ఉద్యోగాల కోత నుంచి టెలికాం రంగంలో సేవల వరకు అన్నింటిలోనూ అనూహ్య మార్పులు రావచ్చు.
చైనా సంస్థలు తయారు చేసిన ముడిసరుకు, పరికరాలను ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్లో వినియోగించకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే భారత్లో నడుస్తోన్న కొన్ని ప్రవేటు టెల్కోలు, హువావే వంటి సంస్థలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ప్రాంతీయ రాజకీయాల కారణంగా వ్యాపారాలను దెబ్బతీయొద్దని కోరాయి. తాజా నిర్ణయం వల్ల దేశంలోని టెలికాం ఆపరేటర్లు, చైనా టెలికాం పరికరాల తయారీదారుల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాయి.
ఖర్చు తడిసి మోపెడు...
తక్కువ ధరలకు సేవలందించే చైనా సంస్థలపై ప్రభుత్వం నిషేధం విధిస్తే.. ప్రైవేటు రంగంలోని టెలికాం నెట్వర్క్లు ఇబ్బందులు పడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్ వంటి సంస్థలు 20-30 శాతం అధిక భారం మోయాల్సి వస్తుంది.
హువావే, జేటీఈ సంస్థలు టెలికాం రంగంలోనూ పోటీపడుతూ.. మార్కెట్లో నాలుగో స్థానంలో ఉన్నాయి. సంస్థల మధ్య పోటీ వల్లే ప్రస్తుతం తక్కువ రేటుకు టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా సంస్థలపై నిషేధంతో సేవల ధరలు పెరిగితే చివరకు అదంతా వినియోగదారులే భరించాలి.